మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Sunday, 20 August 2017

నా బాస నా కైత Where the mind is with out fear

ఏడ భేఫికర్ గుండె ఖుల్లం ఖుల్లా గుంటదో.
ఏడ మోరెత్తుకుని బెదుర్లేక బతక లేస్తమో.

ఏడ తెల్వి ఏ ఒక్కని సోత్తయి పొదో.
ఏడనయితే జమానా జిందగీ మొత్తం బరాబర్ ఇరుకు గదుల్లెక్క ఇడగొట్టుకు పొదో.

యాడ్నతే గొంతునొచ్చే ప్రతిమాటా సచ్చం గుంటదో.
గలేమిల్నకి పుర్శత్ చేతులు పూరా సాపుకుని అలాయ్ బలయ్ అంటయో.

సచ్చమైన పంటకాల్వలెక్క కొట్టే  అలగ్  సొంచాయిన్చుడు బుద్ధి,
పాసిపోయిన పాతలవాట్ల ఇసుకపర్ర లోంకి
ఇంకిపోకండుంటదో.
యాడైతే నా బుర్రా బుద్ధిని సచ్ సొంచాయిన్చుడు లోకి, నిజానం నెరువు తరీకా తొవ్వల్లోకి నువ్ నడ్పుతవో.
అసొంటి బాజాప్తా బతుకుల్లోకి
ఓరయ్యా! ఆడనే నా దేసానికి తెల్లారనియ్యి.

Original : Ravindranath Tagore
Telangana language : Katta srinivas

Saturday, 19 August 2017

మేఘ మల్హరి


దూసుకొచ్చే దాడిని తట్టుకున్న గొడుగు
మొహం ముడుచుకుని ఊపిరి పీల్చుకుంటోంది.
తడిసిముద్దయిన దార్లు తాకితే చాలు బుస్సున లేస్తున్నాయి.
లోపటి ఉక్కని ఆపలేని బయటి చెమ్మగుండా
రోజుటి చక్రం పైన నే నడుస్తున్నపుడు,
కమ్ముకొచ్చే నల్లటి మేఘపు మాటలు ఉరమటం
కొన్నిసార్లు కళ్ళముందు మెరుపులు మెరవటం నాకేం కొత్త కాదు.
కురుస్తున్నంత సేపు విసుక్కుని
ఆగిన తర్వాత చెమ్మకోసం తపించటం
అందర్లాగానే నాకూ అలవాటు.

ఇంకా
చెప్పడానికి
ఏముందని

పట్టి పట్టి చూస్తున్నారింకా?

పరుగు లాంటి పలాయనం
వెలుగుతున్న చీకటి అంచు.

◆19-08-2017

Friday, 11 August 2017

బజారుదానిగా (శృతిహాసన్ కవితకు అనువాదం)
ఒకదినం ఫోన్ల మాట్లాడ్తాంటే
కిసుక్కున ఎక్కిరిస్తా ఇనబడిందో మాట.
"లంజది" అంటూ

ఇజ్జత్ దీసేటి గా సంకరమాట నన్ను ఎనక్కిదోసేసింది.
యాడకో ఎర్కేనా?
మొరాయిస్తా పోయెటి మీ పీతబుర్ర రైల్లా
ఎన్కాల సీటుకి.
అసలైతే ఆడోళ్ళకి మాత్రమే అనే ఆ పెద్దసీటు
గది నీ ఇరుకు బుర్ర ఇముడ్చుకోలేంది.
గది నీ బేశరమ్ పరేషాన్ల కంటే  శానాశానా పొడుగైంది.

అందని అంగూర్ అయిన ప్రతి ఆడదాన్ని
వేరుపడేశి ఎకశకాలు పోనీకి
బజారుదీ అనే సూపు నీ సొల్లునోటి కన్నుది.

రంగులేసుకుని సొంగ కార్సుకుంటా
నీ కోసం సూశేటి గుంపేలేగదా అనుకుంటున్నవా  సానోళ్ళంటే
ఇనుకోరా బిడ్డా...  నీకో ముచ్చట జెప్త.


నువ్వు అగమయ్యిందన్న ఆడదే
నీ సభ్యసమాజానికి ఎదురునిలవగల పంతులమ్మ.

ఆమె వెయ్యి పనులు జేసే వందచేతుల దుర్గమ్మ
నీ సంజాయిషీలను ఫికర్ జేసే పొద్దుకూడా  లేదాయమ్మకి.

ఔ భయ్!  ఆమెకి వందల కోట్ల యాపరముంది సచ్ రే.
అదంతా నీ ఎదవ సోది అనుమానాలు, పనికిమాల్న ఏతుల మీదనే తెల్సా.


సాని అంటే గోరోజనపు పుర్సత్ కోర్కె
సానిది కాదని చెప్తే...
 'కాదు' అనే అర్ధముంటది.
 'అవును'ని మాత్రం మడిచి చేసంచిలో పెట్టుక తిరుగుతది.

సానిదే కానీ సూతరామూ మంచిది.
కనికరమంటే ఎరిగినది.
సానిదే బిడ్డల కోసం నిద్దర వదిలేస్తది.
తనకోసం సోంచాయిస్తా ఉంటది.

దొమ్మరిదే నిన్ను  ఎదగనిచ్చే దొరసాని
భోగందయితే తనకోసం లోగుడ్డలు తనే కొంటది
తనేవి మెచ్చుతదో అయ్యే ఏసుకుంటది.

తన గుండె బద్దలయితదేమోనని బెంగవడదు.
నీపై గుబులయితుందని చెప్పనీకి భయపడదు.
సానిది ఒక ఊరుమ్మడి సనుకట్టు ఆబోతు.


నిన్నొదిలేశిన ఏ ఆడదాన్ని తిట్టాలన్నా
నీ నోటికొచ్చేటిది ఒకటే మాట 'లం..  జ..  ది..'

అందుకే నువ్వింకోసారి
నా దిక్కు సూడాలనుకున్నప్పుడు
నాకోసం పూలు తేవాలనుకున్నపుడు.
నా ముఖమెంక జూడు.
నా కండ్లలోన్కి చూడు.
నా గుడ్డల్లోకి
నా చమడాలోకి
నా రందిలోకి
నా చెప్పుల్లోకి
నా గొంతులోకి
 నా చెడ్డలోకి
 నా త్యాగంలోకి
 నా ఇవాళ్టిలోకి
 నా గతంలోకి
 నా పోరాటంలోకి
 నా కాలంలోకి
 నా ప్రేమలోకి
 నా ఎల్తూరులోకి
 నా మనసులోకి
 నా ఇజ్జత్ లోకి
 అచ్చంగా నేనంటే నాలోకి
 మొకంల మొకం బెట్టి  తొంగిచూసి
దమ్ముంటే అప్పుడు రాయ్ రా బాడకావ్
పంపే ఎర్ర గులాబీల మీన
"లంజదాని కోస౦" అని.


తేదీ 11 అగష్టు 2017
శృతిహాసన్ యూట్యూబ్ లోని కవిత లింకు ఇది.

Monday, 26 June 2017

కట్టా శ్రీనివాస్ || ఇక్కడ వెలుతురు కూడా ఉంది సుమా

సారమున్న మనుషులు వాళ్లు
ఎన్ని ఆలోచనల బీజాలను
కర్తవ్యాలుగా మొలకెత్తించారో కదా!

తడి తెలిసిన గుండెలు వారివి.
కనుల గుండా ప్రవహించడమే కాదు
ఉపశమనమెంత చిప్పిల్లారో మరి!!

కాసుల గొప్ప చప్పుళ్లతో
దిబ్బళ్ళెత్తిపోయిన చెవులు
వాళ్ళ పలకరింపులతో తడమబడితే,

పరుగుల హడావిడిలో
బండబారిపోయిన మొరటు గుండెలు వాళ్ళకెప్పుడన్నా చేరగిల పడితే,

అద్దం ఒక్కసారిగా తేటబారిపోతుంది.
కొలను అలవోకగా నిర్మలమై నిలబడుతుంది.

వాళ్ళు.....
అమ్మా నాన్నలూ,
బంధుగణాల్లో సభ్యులో కావలసిన పనిలేదు,
బాబాలు,
స్వామీజీలు,
హాంఫట్ లు అసలే కాదు.

ఇలా ముఖపుస్తకాల్లో
గుండెలోతుల్ని ఆవిష్కరించే
ఆర్థినిండిన అక్షయ పాత్రలు
కూడా కావచ్చు వాళ్ళు.

అందుకే కిటికీనో, సమాజాన్నో, పుస్తకాన్నో తెరిచి తొంగిచూడటం లాగానే,
సామాజిక మాధ్యమంలోని మరో ప్రపంచాన్ని తరచి పింగ్ చేసినా,

ఓ విశ్వవిద్యాలయం,
మరో సాహితీ సుమం,
ఇంకో కళాహృదయం
ధారలై ఎదురుగా ప్రవహిస్తుంది.

అవును
వాళ్ళు సారమున్న మనుషులు
అవును అవి జీవమున్న రాతలు

( వెతుక్కునే ఓపిక ఉండాలి కానీ,  నిజంగానే జ్ఞానంతో పాటు ఆత్మీయతలను పంచుతున్న సోషల్ మీడియాలోని సారమున్న మనుషులందరికీ కృతజ్ఞతా పూర్వక నమస్సులతో......)
【  ★★★ జూన్ 26, 2017 రంజాన్】
కవిసంగమం లో ప్రచురితం

Friday, 2 June 2017

వీడు మగాడ్రా బుజ్జీ

అది తమిళ నాడు లోని ఒక మద్య తరగతి ఇల్లు. ఆయన పేరు అరుణాచలం మురుగానందం. ఆరోజు ఇంటి దగ్గరే వున్నాడు. అప్పుడే వాళ్ళవిడ చేతుల వెనక ఏదో దాచుకుంటూ వెళ్తోంది. "ఏంటి శాంతి అది" మృదువుగానే కానీ ఉత్సుకతతో అడిగాడు. ఒక్కక్షణం ఆగి మళ్ళీ ప్రశ్నను పట్టించుకొనట్లు ఆమె అలాగే వెళ్తోంది. "ఏంటమ్మా అది" ఈసారి ప్రశ్నలో అసహనం కూడా కలిసింది. ఇకతప్పదన్నట్లు ఆమె ఆగింది. పెటిల్మని మొహంమీద ఒకటిచ్చినట్లు " ఇది మీకు అనవసరం లెండి" అనేసింది. పురుషాహంకారం కాకపోయినా పిల్లచేష్ట కావచ్చు. స్వయంగా లేచెల్లీ అమెచేతులు ముందుకు లాక్కుని చూసాడు.

.....

బహుశా ఈ సంఘటన చాలా పెద్ద మార్పుకు బీజం అవుతుందని ఆమెకు కానీ అతనికి కానీ తెలియదు. ఆమె చేతుల్లో పాత గుడ్డలున్నాయి. అవి ఎంత పాతవి అంటే బైకు తుడుచే గుడ్డ కంటే మురికిగా ఉన్నాయి. అతనికి అప్పుడు అర్ధం అయ్యింది. అతిముఖ్యమైన ఆమె జీవిత అవసరాన్ని అనారోగ్యకరంగా వెళ్ళదీస్తోందని, "వేరేవి కొనొచ్చు కదా శాంతీ" అతనా ప్రశ్నలో ప్రేమను తొణకిస లాడించానని సంబరపడేలోగానే ఇతని తెలియని తనాన్ని సున్నితంగా వెక్కిరిస్తూ ఆమె సమాధానం చెప్పింది. "నేను కూడా టీవీ చూస్తాను. నాక్కూడా పత్రికల్లో వచేప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనింట్లో ఇద్దరికి ఇవి కొనాలంటే పాలబిల్లు కత్తిరించాల్సి వస్తుందని ఇలా సర్దుకు పోతున్నాం." సమాచార జ్ఞానం కంటే మించిందేదో మునీశ్వరుల్లా బయటపడని ఈ ఆడవాళ్ళ దగ్గరుంటుంది అని అర్ధం అయినట్లు ఆయన నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆమె అతన్ని దాటుకుంటూ మెల్లగా లోపటి గదిలోకి వెళ్ళింది.

కధ ఇప్పుడే మొదలయ్యింది.

◆{{{{౺౾౻౺౾౻౽౿౽౺౻౾౽౿౾¥౾¥౾¥౾}}}◆

1962 లో పుట్టిన అరుణ్ ఇంకా గానుగెద్దు జీవిలా మారలేదు. ఎలాగైనా శాంతికి ఒక ఆరోగ్యకరమైన పరిష్కారాన్ని బహుకరించాలనుకున్నాడు. అలా అప్పుడప్పుడూ ఆమెను సంతోషపెట్టడం తనకి మరింత సంబరం కాబట్టి. బయటి షాపులో ఒక నాప్ కిన్ కొన్నాడు. సెల్లులోస్ కాటన్, పైన్ చెట్ల చెక్కపేడు గుజ్జు లాంటివి మాత్రమే ఉన్న ద్రవాన్ని పీల్చుకుని నిల్వవుంచుకునే ఈమాత్రం గుడ్డ ముక్కలకు ఇంత ఖరీదా? ఆశ్చర్య పోయాడు. ఇంత కాంటే మెరుగైనవి ఇంకా చౌకగా తయారు చెయ్యటం సాధ్యమే అనిపించింది. వెంటనే చకాచకా ఆ ఆలోచనను అమల్లో పెట్టాడు. పరీక్షించమని శాంతి కిచ్చాడు. పెద్దగా బాగాలేదు పాతపద్ధతే నయమని పెదవి విరిచింది ఆమె. ఎడిసిన్ బల్బు కనుక్కునేప్పుడు వెయ్యిసార్లు పరీక్ష చేసి ఉండొచ్చు. ఇప్పుడు రెండోసారి తను పరిశీలించాలంటే మరో నెల వరకు ఆగాలి. ఇలా అయితే మంచి నమూనా సృష్టించడానికి దశాబ్దాలు పడుతుంది. మరో మార్గం వెతకాలి. ఇది అత్యంత రహస్య విషయమే కాదు. అత్యంత నిషిద్ధ కట్టుబాటుగా సమాజం లో ఉండటం తో ఆఖరికి ఈయన గారి అక్కాచెల్లెళ్ళు కూడా ఈవిషయం లో ప్రయోగాలకైతే నువ్వు మయింటికి రాకపోవడమే మంచిదని తేల్చేశారు. మగవాడైన తనకి ఇంత సున్నితమైన విషయంలో మరో మార్గం ఎలా అని ఆలోచిస్తుంటే హఠాత్తుగా మెడికల్ కాలేజి విద్యార్థినులు గుర్తొచ్చారు. నోటితో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఫీడ్ బ్యాక్ పత్రాల్లో రాసిమ్మని అడిగాడు. ఈ ధోరణికి చుట్టుపక్కల వాళ్ళు బహిరంగంగానే విమర్శించే వాళ్ళు. వీడొక పర్వర్టు రా అని హేళనలు ఎన్నెన్నో చుట్టుముట్టాయి. ఆఖరికి ఎవరిగురించి ఈ పరిశోధన మొదలెట్టాడో ఆ శాంతి కూడా అశాంతిగా మారింది. వీటన్నిటికీ ప్రతిగానా అన్నట్లు అరుణ్ మరింత కసిగా తన పని కొనసాగించాడు. మెడికల్ కాలేజీ అమ్మాయిలు సైతం ఇంత ముడుచుకు పోతారా అని ఆ సమాధాన పత్రాలను చూసి నైరాశ్యానికి గురయ్యేవాడు.

ఎవరిమీదో ఎందుకు తన మీద తానే ప్రయోగం చేసుకోవాలనే ప్రళయ నిర్ణయం తీసుకున్నాడు. ఒక రబ్బరు తిత్తి లో ఇంకు పోసి దానికి సెలైను గొట్టం కలిపాడు. తిత్తిని నొక్కినప్పుడల్లా ఇంకు గొట్టం ద్వారా బయటికి వస్తుంది. అంతే కాదు భార్య శాంతి కూడా ఈయన్ని వదిలి బయటికి వచ్చేసింది. విడాకుల పత్రాలూ పంపేసింది. వాటిని పక్కన పెట్టి వంటరి ఇంట్లో ఈయన పరిశోధన మరీ పెంచాడు. వాడిన తర్వాత లోపాలను తెలుసుకునేందుకు used pads తెచ్చి వెనక గదిలో కుప్పలుగా పోసాడు. సరే వాటిని తేవడానికి పడ్డ బాధలు మరో కథ అవుతుంది వీటిని వాడి ఈ పిచ్చోడు వశికరణమో, చేతబడో చేస్తాడేమో నాని అనుమానించి అవమానించిన వారూ వున్నారు.

ఒక ఆదివారం ఈయన దగ్గరకు వల్ల అమ్మ వచ్చింది. ఈ నీచు వాసనకు కారణం, కొడుకు చేపలో, చికెను కూరో వండు తున్నాడు కావచ్చు  అని ముందు అనుకుంది. తర్వాత విషయం తెలిసి షాక్ అయిపోయి శోకాలు పెట్టింది ఆవిడ.

చివరికి కోట్లాది రూపాయల ఖర్చుతో ఉన్న యంత్రాల స్థానం లో 65 వేల రూపాయిల యంత్రాన్ని సృష్టించాడు. అంతేకాదు ఈ గొప్ప ఆవిష్కరణకు పేటెంట్ కూడా లభించింది. 9 వ తరగతి లో చదువు ఆపేసిన అరుణ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉపన్యసించాడు. దేశంలో గొప్ప పురస్కారం "పద్మశ్రీ" ని పొందాడు. టైమ్స్ పత్రిక నిర్వహించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో మోడీ ని, రాహుల్ ని, కేజ్రివాల్ ను తోసి రాజాని ముందుకొచ్చి నిలబడ్డాడు. అయినా సరే ఆయన లక్ష్యం ఇంకా నేరవేరనే లేదంటున్నారు. దేశం లోని 29 రాష్ట్రలలో 23 లో ఇప్పటికే తన జయశ్రీ పరిశ్రమ ద్వారా తక్కువ ధరకే వ్రక్తిగత అవసర వస్తువుని అందుబాటులో కి తీసుకువచ్చాడు. ప్రతి 5 మంది అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్యతోనే బడి మానేస్తున్నారు. అధిక సర్వైకల్ కాన్సర్ లకు అందుబాటు లో లేని పరిశుభ్రతే కారణమని అరుణ్ కి తెలుసు అందుకే.
తన పేటెంట్ ను అధిక మొత్తానికి అమ్ముకోకుండా ప్రపంచంలో అన్నీమూలలకూ అది తక్కువ ధరలోనే చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ menustual man.

సరే అసలు విషయం చెప్పనే లేదు కదా శాంతి తిరిగొచ్చింది. ప్రపంచం సగౌరవంగా తన భర్త గొప్పతనాన్ని నెత్తి మీద పెట్టుకుందో అర్ధం అయిన తర్వాత తనెంత తప్పుగా అనుకుందో తెలిసొచ్చింది. ఇప్పుడు అరుణ్ తోనే సంతోషంగా కలిసిపోయింది.

■ మొత్తం ఆర్టికల్ ను మొబైల్ మీదనే టైప్ చెయ్యడం తో కొన్ని అక్షర దోషాలు దొర్లాయి. అర్థాన్ని తీసుకుంటూ చదవగలరు.
మూలం : నా ఫేస్ బుక్ పోస్ట్https://m.facebook.com/story.php?story_fbid=1557271544297358&id=100000435816359Thursday, 25 May 2017

కట్టా శ్రీనివాస్ ౾౾ కెటలిష్ఠుడు ౾౾

థాంక్స్ రా బాబాయ్
టంగ్ స్లిప్ చలపాయ్.

మురికి తొట్టి మూత తీస్తే తీసావ్.
మరకలు తుడిచే పని షురూ అయ్యింది.
రోట్లో నోరు పెట్టావ్ రోకలి పోటు ఎలాగూ తప్పదు.
నువ్వుప్పుడు సారీ అన్నా
నీపక్కనున్న వాళ్ళకి  ఆ మాత్రం ఇంగితమే లేకున్నా.
ఎప్పటినుంచో మా మనసుల్లో   రగులుతున్న మంటలాగవు.

మంత్రి కొడుకువో, ముసలి హీరోవో అయితే.
మా నోళ్లు మొరాయించేవి.
పాత్రల్లేని విలన్ షేడ్ ఉన్న చిన్న కమెడియన్ వేగా,
సూసుకుందాం నీ పెతాపమో మా పెతాపమో.
నీ వెనక ఓ మంద నీడ ఉంటే
మా పరుగు మందగించేది.
మందబుద్ధిలా కనిపిస్తున్నావ్ మకింకేం భయ్యం.
దట్టించిన కోపమున్నా
ఎక్కుపెట్టే భుజం ఇన్నాళ్లుగా దొరకలేదు.

పర్లేదు బాబాయ్
నోటిదూల చపలపాయ్.
గట్టి సపోర్టు నిచ్చావ్.

చెదలు పట్టిన మూలలన్నీ దులపాలంటే
ఎక్కడో అక్కడ మొదలవ్వాల్సిందే.
నీ దెబ్బతో లక్షల చేతుల్లో కర్రలు బిగిసాయి.
వేల నాలుకలు జాగ్రత్తను పులుముకున్నాయి.
వందల నోళ్లు నినదిస్తున్నాయ్.
డజన్ల కొద్దీ సీరియళ్లు సెన్సార్ కత్తెరను వెతుక్కుంటున్నాయ్.
ప్రకటనల్లోని పైత్య ప్రకోపాల పసరు పిసరంతయినా పిండేయ్యాల్సిన ప్రయత్నాల సమయం ఆసన్నమైంది.

దేహానికే ఉండాల్సిన జెండర్
సంస్కృతికి నాటేస్తుంటే.
సృష్టికార్యపు తీపిని
వ్యాపార వస్తువుగా అంగట్లో పెడుతుంటే
ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.
మొత్తం మనుగడనే కాపాడుకునే
అడుగులు పడాల్సిన సమయమొచ్చింది.
పోన్లే నీ వల్ల అది మొదలయ్యింది.

తేదీ ◆25౽05౽2017

Tuesday, 14 March 2017

కట్టా శ్రీనివాస్ ||వెలుతురికి ముందుమాట||

ఒక వేటగాడి నిశ్శబ్దం ఓటమి కాదు.
ఒక బాణం వెనక్కి లాగబడటం పతనం కాదు.

బిగువెక్కే తంత్రి వత్తిడి కి లోనయినట్లు కాదు.
క్రిందకు ఊరికే బంతి పని అయిపోయినట్లు కాదు.

ప్రతి ఏకాంతం ఒంటరి తనం కాదు.
ప్రతి మౌనం మాటలుడిగి పోవటం వల్ల రాదు.

నిలబడే సత్తువే నీలో ఉంటే....
ఏ అడుగూ వృధాపోదు.

తేది : 14-03-2017

Friday, 10 March 2017

కొత్త విత్తనం కావాలి

అవే మాటలు వాడీ వాడీ
అరిగిపోయి
అర్ధాన్ని కోల్పోయాక
నేనెందుకో మూగగా మిగిలిపోతాను.

అదే నవ్వు పైపైనే
తేలిపోయి
ఆర్ధ్రతంతా ఆవిరయ్యాక
అచ్చంగా స్థబ్దమై మ్రాన్పడిపోతాను.

అదే ఆలింగనం
యాంత్రికమై
చప్పగా పుక్కిలించాక
స్థాణువై నిస్త్రాణంగా నిలబడిపోతాను.

నీ పుట్టిన రోజు నా మనసులో ఈదులాడక
సామాజిక మాద్యమాల స్పురణలో పైకితేలినపుడు
అవేవో చిత్రాలు, అచ్చంగా ctrl V మాటలు
ఎమికాన్లై హడావిడీ చేస్తే
చీకట్లో చిన్నగా నిట్టూర్చేస్తాను.

ఇదంతా నిర్లక్ష్యమనుకుంటావు నువ్వు
నిర్లిప్తతనే పదానికర్ధం వెతుకుతాను నేను
భూమితిరగటం ఆపితే కదా
బొంగరంలా తిప్పే ప్రయత్నం చేసేందుకు.
మొక్కఎదగటం ఆపితే కదా


కొరతకోణాన్ని నింపాలని చూసేందుకు.

Saturday, 25 February 2017

‘మంచి’ నీళ్ళు

పదోతరగతికి ప్రీఫైనల్ పరిక్షలు జరుగుతున్నాయి. పిబ్రవరి నెలే కానీ ఎండలు బాగానే ముదిరాయి. పైగా మూడు సెక్షన్లని కలిపి ఒకదగ్గర కూర్చోబెట్టాలంటే క్లాస్ రూమ్ ఏదీ చాలదు. అందుకే మీటింగ్ హాల్ ని ఆశ్రయించాం. కాకపోతే అదేమో రేకులతో కప్పిన పాత భవనం. ఎండవేడి మరీ తెలుస్తుంది. పిల్లలకు నీళ్లు ఎన్నితాగినా దాహం తీరటం లేదు. సరే అని వాళ్ళకి సరిపడేలా రెండు కూల్ క్యాన్లలో వాటర్ వేయించాను. ఇక పిల్లల ఖుషీ చూడాలి. ఎంత చిన్న సంబరాన్నైనా గుండెల్నిండా నింపుకోవడం పిల్లలకే సాధ్యం అవుతుందేమో. చాలా మంది పిల్లలు థాంక్స్ కూడ చెప్పారు. అయితే దీనివెనక నేను వాళ్ళకే థాంక్స్ చెప్పేంతగా రుణపడ్డ విషయాలు చాలా వున్నాయి. అదంతా వాళ్లకి చెప్పలేదు అర్ధం అవ్వడానికింకా సమయం పడుతుందేమో నన్న అనుమానంతో.

ఆ రోజు సాయంత్రం పదోతరగతి వాళ్ళకి నా సబ్జెక్టులో ఈవెనింగ్ క్లాసుంది. మూడు సెక్షన్ల పిల్లల్ని చెట్టుక్రింద కూర్చోబెట్టుకుని ఎప్పట్లాగానే ఏదో పాఠం చెప్తున్నాను. ఇంతలో నఫీషా అనే ఒకమ్మాయి హటాత్తుగా లేచి తన క్లాస్ వైపు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మామూలుగా అయితే అడిగే వెళ్ళటం అలవాటు కానీ ఏదైనా తప్పనిసరి అవసరం వుంటే అనుమతుల హడావిడేం లేదు వెళ్ళొచ్చని వాళ్ళకి అలవాటు చేసివుండటంతో, మిగతావాళ్ళేం పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే పాపం ఏమైనా ఇబ్బందొచ్చిందేమోనని నాదొక కన్ను అటువైపు గమనిస్తూనే వుంది. అలా వెళ్ళిన ఆ అమ్మాయి ఒక వాటర్ బాటిల్ తో హడావిడిగా నా దగ్గరకొచ్చి తాగండి సర్ అంటూ ఇచ్చింది. ‘‘ ఎందుకురా మంచినీళ్ళు తెచ్చావ్’’ ఆశ్చర్యంగా అడిగాను. మీరు చాలా సేపట్నుంచి మాట్లాడుతున్నందుకేమో చాలా సార్లు దగ్గొచ్చింది కదా సర్ కొంచెం నీళ్ళుతాగితే సర్దుకంటుంది. ఆ అమ్మాయి సింపుల్ గా చెప్పినా, నాకెందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయి. మనం ఈ పిల్లలకు ఏమిస్తున్నాం? ఇంత ఇష్టాన్ని పెంచుకున్నారు. నేను తిరిగి ఏమివ్వగలను. మరేం మాట్లాడకుండా నీళ్ళుతాగి, థాంక్స్ చెప్పి పాఠం కంటిన్యూ చేసాను కానీ మనసులో ఆ సంఘటన అలా తిరుగుతూనే వుంది.

అంతేనా ఉదయం రాగానే టిఫిన్ తిన్నారా సర్ అని అప్పుడే అంతదూరం నుంచి ఎలా రాగలిగారు అంటూ పలకరించే పిల్లలందరి ప్రేమకీ నేను పడ్డ సంబరంతో పోల్చుకుంటే వాళ్ళవల్లనే వచ్చే జీతం నుంచి ఇలా ఖర్చుపెట్టేది చాలా చాలా తక్కువే కదా. గవర్నమెంటు స్కూలు పిల్లలంటే ఫారంలో పెరిగే కోళ్లలాగా తెల్లగా పద్దతిగా ఒకే గదిలో గడగడలాడుతూ వున్నట్లు కనపడక పోవొచ్చుకాక. నాటుకోళ్ళమాదిరి స్వేచ్చగా గంతులేస్తున్నట్లు కనబడొచ్చుగాక. కానీ వీళ్ళ పిలుపులో పలకరింపులో పనుల్లో ఏదో జీవం కనబడుతూ వుంటుంది నాకు. రామాంజనేయ సాయి వాళ్లనాన్న చనిపోయిన దుఃఖంలోనూ ఫోన్ చేయటం. అమ్మనాన్నలను పోగొట్టుకున్న స్పందన నిబ్బరంగా పరిక్షలకోసం ప్రిపేర్ అవుతూ వుండటం మాత్రమే కాదు. పూటగడవని ఇళ్ళనుంచి విధికి ఎదురీదుతూ వస్తున్న మొదటి తరం చదువుల జెనరేషన్ మా దగ్గరే రూపుదిద్దుకుంటోంది. ఒక బ్యాచ్ వెళ్ళిపోతున్నప్పుడు ఏదో వెలితి దాంతో పాటే సంతోషం. మరోబ్యాచ్ సిద్దమవుతూనే వుంటుంది. జీవితంలాగానే వ్యవస్థకూడా ఒక ప్రవాహం కదా. 

 ఈ ప్రవాహంలో నీళ్ళే ఒడ్డుకు రుణపడ్డాయా? ఒడ్డే నీళ్ళకు బాకీ పడిందా? నేనిప్పటికీ ఇదిమిధ్దంగా తేల్చుకోలేకపోతున్నాను.

ఫేస్ బుక్

Tweets

లంకెలు