సు రా శో కం

‎" సు రా శో కం "



ఒక అర్దరాత్రి

కలత నిద్రలో సోలుతున్నప్పుడు
తలుపులు విరగబాదే శబ్డం

చెవుల్నిచేరకముందే
పరిచితమైన వాసన
నాసికాగుహల గుండా
ఒరుసుకుంటూ వెళ్ళి
మెదడుని ఉలిక్కిపడేలా కలుస్తుంది.

కళ్ళు నులుముకుంటూ కంగారుగా వెళ్ళి
గడియ తెరియగానే
చిత్తుచేసే మత్తు వాసనతో పాటు
మొరటు శరీరం ఒకటి
అదాటున మీదకి ఒరుగుతుంది.

కుండ లోని ఎదురు చూపుల్ని
కంచం లోకి వడ్డిస్తే
కాళ్ళైనా కడుక్కోకుండా
కన్నీళ్ళని జుర్రుకున్నట్లు
చిత్తడి చిత్తడిగా
తినటం పూర్తిచేసానని పిస్తాడు.

ఒక్కోసారి అంత మాత్రపు స్ప్రహకూడా

కళ్ళకొవ్వొత్తులలో మిణుకు మిణుకు మంటూ వుండదు.


ఈ రోజు ఇది ఎన్నోసారో
ప్యాక్టరీ గొట్టానికి గుప్పు గుప్పున నిప్పంటించడం.
నిద్రపోతున్న పిల్లల్ని సైతం లెక్కచేయకుండా
విషవాయువులని ఎగజిమ్ముతూ
నవ్వుకుంటున్నాడు.


దిండు మడతల్లో
దాచుకున్న మోహంతో
పక్కకి తిరిగి పడుకున్న
నా నడుము మడతల పై గుండా
రోకలి బండ పురుగులు
లోపలికి పాకుతుంటాయి.
రెండు బండపెదాల పైన
ఎప్పటి నుండో తిష్టవేసుకున్న
ఓ పాడు గొంగళిపురుగు
మెడ వంపులో మరీ మరీ
గుచ్చుకుంటూ వుంటుంది.




రోలింగు చక్రల బరువుకింద
రోడ్డునై
మౌనంగా బండబారి
బిగిసిపోయే లోగానే
ఏ రోడ్డు పక్కనో పడిపోకుండా
ఇంటి దాకా చేరాడు కాబట్టి
ఇలా నా పక్కన
సొమ్మసిల్లి పడిపోతాడు.

(చాలాకాలం క్రితం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన నా కవిత)

కామెంట్‌లు

  1. కళ్ళకు కట్టినట్టు వర్ణించారు శ్రీనివాస్ గారు
    సీసా రాయుళ్ళ దౌర్జన్యాన్ని , సీతమ్మ తల్లుల ఔదార్యాన్ని,
    జల్సా పురుషుల ఖులాసా జీవితాన్ని, మూర్తీభవించిన స్త్రీ క్షమని
    అర్ధం చేసుకొని మగాళ్ళ(మృగాళ్ళ...కొందఱు మాత్రమే) ఆకృత్యాలని,
    అవనికే సహనం నేర్పే ఇల్లాలి ఆకృతి ని , సంస్కృతిని ...

    అభినందనలు ..
    -సుష@4U4ever@

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభినందన స్పూర్తినిచ్చిందండీ...ప్రోత్సాహకరమైన మొదటి కామెంట్ కు ధన్యవాదాలండీ.....

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి