అందమైనది కంద పద్యం

తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు.
......................................................................

►ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది.

►సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.

►క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్


► లక్షణములు

♫ పాదాలు: 4
☼ కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు

1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.

2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.
యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి

ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు.

► కంద పద్యములో ఉండవలసిన గణములు ◄

గ గ = U U
భ = U I I (ఆది గురువు)
జ = I U I (ఆది గురువు)
స = I I U ( అంత్య గురువు )
నల = I I I I

☼ ఏ గ్రహాంతర వాసుల వైజ్ఞానిక సంపదో అందలేదు కదా అనేలా కంప్యూటర్ లో లాగానే ఛందస్సు కూడా ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉన్నది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటున్నాం. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు.

♦ ♣ ♣ ♣ ♦


కొన్ని ఉదాహరణలు



అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడ బడ
నడుగిడు నడు గిడదు జడిమ నడుగిడు నెడలన్

మొసలికి చిక్కి శ్రీహరి కొఱకై ఆర్తనాదాలు చేయుచున్న గజేంద్రుని రక్షించుటకై వడివడిగా బయలుదేరిన విష్ణువు ననుసరించిన లక్ష్మీదేవి పరిస్థితిని వివరించే పద్యం ఇది. సంగతేమిటో, ఏమయిందో అడుగుదామని అడుగు ముందుకేసి కూడా అడగలేక, తడబడుతున్న అడుగులతో, గుండె దడతో భర్తను అనుసరించింది.

►శ్రీశ్రీగారు మ,న,స అనే మూడక్షరాలతోనే త్యక్షర కందాన్ని రసవత్తరంగా అందించారు.

మనసాని నిసిని సేమా
మనసా మసి మనిసి మనసు మాసిన సీనా
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!

సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనేపదాలతో చమత్కారమందించారు. ఇందులో శ్రీ శ్రీగారు మహాకవిగా కంటె సినిమా కవిగా కనిపిస్తారు.

►ఒక అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి రసజ్ఞుల నలరించారు.

మా పని నీ పని గాదా
పాపను మా పాప గారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పని గానిమ్మా!!

► కొన్ని పద్య చమక్కులు చూద్దాం. ఎటువైపునుండి చదివినా ఒకేలా ఉండడమే కాకుండా అర్థభేదంతో ఉండే అనులోమ-విలోమ పద్యాలు. ఈ పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.

దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!

ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.

సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!

► పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.

ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!

► ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. (ఈ ప్రక్రియను ఇంగ్లీషులో Palindrome అంటారు)

రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!

► పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో తెనాలి రామకృష్ణుడికి వికట కవిత్వమెలా అబ్బిందో క భాషలో ఇలా చమత్కారంగా చెప్పారు.

తే.గీ. కవి కక కట కక కవి కగ కన కను క
దీ కవ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!

ఈ పద్యంలో క లు తీసివేసి చదివితే ” వికట కవిగ నను దీవన లిడి కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె ” అనే వాక్యం వస్తుంది.

► అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు.

మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!

చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

► మల్కిభరాముడు ఇచ్చిన సమస్యా పూరణం...
ఆకుంటే, ఈకుంటే, మాకుంటే, మీకుంటే అని సమస్య.

ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే హీనుడగును హీనాత్ముండౌ
మీకుంటే మాకియ్యుడు
మాకుంటే మేము రాము మల్కిభరామా...

మాలిక్ ఇబ్రహీం కాస్తా తెలుగు వారి అభిమానంతో మల్కిభరాముడు అయ్యాడని ప్రతీతి.

► పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉండే మరో పద్యమిది. ఇది శ్రీ విక్రాల శేషాచార్యుల వారి విరచితం శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరము లోనిది.
..
దామోదర రదమోదా
రామా తతరా జయ యజరా తతమారా
రామా జని నిజ మారా
భూమా తతభూ మతతమ భూతత మాభూ.

► తెలుగులో పాదభ్రమక లక్షణమును తన లక్షణ సార సంగ్రహములో చిత్రకవి పెద్దన గారు వర్ణించిన విధానమిది.
..
అనులోమ విలోమంబుగ
ననువొంతగ బాదపాద మతి తిరుగంగా
బెనచుక చెప్పిన గందము
జను బాదభ్రమకమనగా సత్కృతులందన్

► కందం పైన ప్రయోగ రూపమే సినారె గారి "మాకందం". కంద పద్యంలో 1,3 పాదాలను 2,4 పాదాలపైన కూర్చితే వచ్చేదే "మాకంద పద్యం".
..
కందమునే మలచితి మా
కందముగా పలికితి ఆ
ఛందమునకు పాతగతులు సమకూరుస్తూ
స్పందమునకు కొత్త శృతులు సంపాదిస్తూ!

► పూర్తి హ్రస్వ అకార (హల్లులపై తలకట్టు)పద్యమొకటి కేశవయ్యగారి దాశరథి చరిత్ర లోనిది.
..
దయగనర ఘన దశరథ తనయ! సనయ!
గగన చర రథ!దశశతకర శశధర
నయన!సతతసరస!నతనగచరచయ!
తత దరహరద!దశ గళదళన!సదయ.


మరికొంత సమాచారం కోసం

జెజ్జాల కృష్ణ మోహన రావు  గారి కందపద్యగాధ-1 మరియు కందపద్యగాధ-2


కామెంట్‌లు