క్రీస్తుకు పూర్వమే తెలుగు


క్రీస్తుకు పూర్వమే తెలుగు!
తొలి తెలుగు పదం 'నాగబు' కాదు..
'అంధిర లోకము'!
కర్నూలు జిల్లాలో ఎనిమిది శాసనాల్లో లభ్యం

కుట్ర.. మహా కుట్ర.. తెలుగు ప్రాచీనతను వేల ఏళ్ల మేర కుదించేందుకు తమిళులు పన్నిన కుట్ర! క్రీస్తుపూర్వం 3000-2500 సంవత్సరాల నాటికే తెలుగు ఒక భాషగా విలసిల్లిందని నిరూపించే శాసనాలు మూడు దశాబ్దాల క్రితమే బయటపడ్డాయి! అయినా.. ఆ శాసనాలు వెలుగు చూస్తే తెలుగు కన్నా ప్రాచీనమైనదిగా భావిస్తున్న తమ భాషకు ఎక్కడ ఆ హోదా దక్కకుండా పోతుందో అన్న భయంతో వాటిని చెన్నైలోని సెంట్రల్ లైబ్రరీకి పరిమితం చేశారు! తెలుగు భాష ఔన్నత్యాన్ని తగ్గించిన ఆ చీకటి నిజాలు.. తమిళుల కుట్ర.. ఇప్పుడు బయటపడ్డాయి.



 అమరావతిలోని ఒక స్తూపం మీద 'నాగబు' అనే పదం ఉంది. శాసనాల్లో తొలి తెలుగు పదం అదే అని పలువురు భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, 'నాగబు' పదానికి నిజంగా ఆ ఘనత లేదా? క్రీస్తు పూర్వం నాటికే తెలుగు ప్రత్యేక భాషగా ఉండేదా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. 'అంధిర లోకము'.. తెలుగులో శాసనబద్ధమైన తొలి పదం ఇదేనని పురావస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇందుకు ఆధారమైన క్రీ.పూ.3000-2500 ఏళ్లనాటి శాసనాన్ని.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలలో కనుగొన్నారు.

ఈ శాసనంలో "అంధిరలోకము'' అనే పదం ఉంది. ప్రస్తుతం మనం 'ఆంధ్ర లోకము'గా పలుకుతున్న పదాన్నే పూర్వం ఇలా అనేవారని గుర్తించిన పరిశోధకులు దీనిని ప్రపంచంలోనే శాసనపూర్వకమైన తొలి తెలుగు పదంగా గుర్తించారు. ఓర్వకల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో దొరికిన మరో ఎనిమిది పురాతన శాసనాల్లోనూ తెలుగు పదాలను కనుగొన్నారు. కన్నమడకలలోనే.. "అంధిరపతి'' అనే పదం ఉన్న మరో శాసనాన్ని కూడా కనుగొన్నారు. అలాగే తెలుగు, బ్రాహ్మీ లిపిలో ఐదు పంక్తులు కలిగిన క్రీ.పూ.300 నాటి మరో శాసనం కూడా అక్కడే లభించింది.

ఈ శాసనంలో ఆంధ్రము అనే పదాన్నే "అంధిరం''గా పేర్కొన్నారు. బొల్లవరం గుట్టలవద్ద క్రీ.పూ.400 కాలం నాటి మరో శాసనం లభ్యం కాగా ప్రాచీన తెలుగు బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనంలో "గిబ్బతీగల'' అని రాసి ఉంది. తీగల అనేది కూడా అచ్చ తెలుగు పదం. క్రీ.పూ.4వ శతాబ్దం నుంచి ఇప్పటివరకూ కూడా బొల్లవరం సమీపాన ఉన్న ఈ రాళ్లగుట్టను గిబ్బతీగల అనే పిలుస్తుండటం విశేషం. గిబ్బతీగల గుట్ట రాళ్లపై క్రీ.పూ.500 నాటి మరో శాసనం ఉండగా అందులో 'పొల్లావరం' అనే పదాన్ని గుర్తించారు.

అలాగే.. కేతవరం గ్రామంలో లభించిన క్రీ.పూ.4వ శతాబ్దం నాటి మరో శాసనంలో "యు.సిద్ధాంతము'' అనే పదాన్ని "యు.చిత్ థాన్ తము''గా పేర్కొన్నారు. "కేశవులు మువ్వడి'' అని రాసి ఉన్న క్రీ.పూ.625 నాటి మరో శాసనాన్ని కూడా కేతవరంలోనే గుర్తించారు. క్రీ.శ.800 నాటి మరో శాసనంలో.. "తుంగభద్ర'' అనే అచ్చ తెలుగు పదాన్ని కూడా కనుగొన్నారు. అంటే.. క్రీ.పూ.3000-2500 కాలం నాటికే తెలుగు ప్రత్యేక భాషగా ఏర్పడిందనే విషయం స్పష్టమవుతోంది.

కారణాలేవైనాగానీ.. అమరావతిలోని 'నాగబు' పదం కంటే అత్యంత పురాతనమైన తెలుగు పదాలను కర్నూలు జిల్లాలో కనుగొన్నా ఆ విషయం బయటికి రాకపోవడంతో తెలుగు భాష సముజ్వల చరిత్రను, ప్రాచీన్యతను కూడా కోల్పోవాల్సి వచ్చింది. తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచే వాస్తవాలు ఎందుకు మరుగునపడ్డాయి? లాంటి ప్రశ్నలకు విస్పష్ట సమాధానాలున్నాయి.

ఎనిమిదో దశకంలోనే..
1977లో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ సూర్యన్ కాశీపాండ్యన్ ఓర్వకల్లు మండలంలో సాగించిన పరిశోధనల్లో కేతవరం, పూడిచెర్ల ప్రాంతంలో ప్రాచీన లిపి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసి, 1980ల్లో.. తమిళనాడు భాషా పరిశోధకుడు సుబ్రమణ్య మలయాండి కర్నూలు జిల్లాలో పరిశోధనలు సాగించి పురాతన తెలుగుపదాలను కనుగొన్నారు. 'అంధిరలోకము'నే తొలి తెలుగుపదంగా ఆయన కూడా గుర్తించారు.

"హిస్టారికల్ స్టడీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. ఎ కంపారిటివ్ స్టడీ ఆఫ్ తుంగభద్ర అండ్ వ్యాలీ'' పేరిట పరిశోధన పత్రాన్ని మలయాండి సమర్పించారు. ఈ విషయంలో ఆయనకు తోటి తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్రీస్తు పూర్వం 2500 నాటికే తెలుగు భాషా, లిపి ఉందని నిర్ధారిస్తే తమిళానికి తెలుగు తర్వాతి స్థానమే లభిస్తుంది. అందుకే మలయాండి పరిశోధనాంశాలను ప్రాచుర్యంలోకి తేవడానికి తమిళులు అంగీకరించలేదు. దీంతో మలయాండీ కన్నమడకలలో శోధించి సాధించిన శాసనాలు చెన్నై సెంట్రల్ లైబ్రరీలో పడిపోయాయి.

దీని ఫలితంగానే 'నాగబు' కంటే ప్రాచీనమైన తొలి తెలుగు పదం గురించి తెలియకుండాపోయింది. అయితే మలయాండి విదేశంలో సమర్పించిన పరిశోధన పత్రం ప్రతులు కొన్ని బయటకు వచ్చాయి. అలా ఒక ప్రతి.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చేరగా, అది కర్నూలు జిల్లాకు చెందిన సాహితీ పరిశోధకరత్న.. వైద్యం వెంకటేశ్వరాచార్యులు చేతికి చేరింది. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని వైద్యం వెంకటేశ్వరాచార్యులు ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా "కర్నూలు జిల్లా కవి తరంగిణి'' పేరిట అనే పుస్తకాన్ని రచించిన వైద్యం.. "ఆంధ్రలోకము'' పదానికి చెందిన ప్రాచీన లిపిని ఆ పుస్తక ముఖచిత్రంగా ముద్రించారు.

హంద్రీ నుంచే ఆంధ్ర!
ప్రాచీన తెలుగు భాష ఆనవాళ్లు లభించడమే కాదు.. ఆంధ్ర అనే పదం కూడా కర్నూలు జిల్లాలోనే పుట్టిందని కూడా భాషా పరిశోధకులు చెబుతున్నారు. ఈ జిల్లాలో ప్రవహించే హంద్రీ అనే చిన్న నది నుంచే "ఆంధ్ర'' అనే పేరు వచ్చి ఉం టుందని ప్రముఖ తెలుగు పరిశోధక పండితులు మల్లంపల్లి సోమశేఖర శర్మ గతంలో వెలిబుచ్చిన అభిప్రాయం నిజమేనని చెప్పడానికి కావాల్సిన ఆధారాలున్న శాసనాలు కూడా ఇక్కడ లభించాయి.

దాదాపు 1400 ఏళ్ల క్రితం నాటి ఒక తామ్ర శాసనంలో ఇం దుకు ఆధారాలున్నాయి. ఆ శాసనంలో ఈ నదిని "అందిరి''అని పేర్కొన్నారు. ఈ నది ప్రవహించే గూడూరు, కోడుమూరు ప్రాంతాలలో కానుగ చెట్లను పోలి ఉండే అంద్రిక చెట్లు ఇప్పటికీ ఉంటాయి. ఈ చెట్ల కారణంగానే ఈనదికి అందిరి నది అని పేరు వచ్చిందని.. కాలక్రమంలో ఆ పేరు హంద్రీగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఆధారం : ఆంధ్రజ్యోతి కథనం

కామెంట్‌లు

  1. శ్రీనివాస్ గారూ, కొన్ని సందేహాలు.

    1. 'లోక:' సంస్కృత పదం కదా? కర్నూలు లోని శాసనం క్రీ.పూ 3000 నాటిదైతే అప్పటికే సంస్కృత ప్రభావం తెలుగు మీద పడిందా? వేద సంస్కృతం సుమారు క్రీ.పూ 2000-1000 నాటిదని అంచనా. అయితే కర్నూలు శాసనం అంతకు పూర్వానిదని ఎలా నిర్ధారించారు?

    2. బ్రాహ్మీ లిపి క్రీ.పూ 500 నాటిదని చారిత్రకుల అంచనా. మరి కర్నూలు శాసనం బ్రాహ్మీ లిపి లో వ్రాస్తే క్రీ.పూ 500 తర్వాత కదా అది వ్రాసి ఉండాలి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక శాసనం, మరో శాసనం ఇలా సాగుతుంది తప్ప వ్యాసం ఎక్కడా శాసన వివరాలు ఇవ్వకపోతే ప్రస్తావిత అంశమేదీ నిలబడదు.

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి