గౌడకుల ప్రాతినిధ్యాన్ని చూపుతున్న ఖమ్మంజిల్లాలోని ఒక శాసనం : కాటమయ్యగా పూజలందుకుంటోంది

ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ శిలా శాసనం చాలారోజుల క్రితం కావాలని మరీ వెతుక్కుంటే దొరకనని మొరాయించింది. రెండురోజుల క్రితo  విస్సన్న పేటకు బైకు మీద వెళుతుంటే పొలాల మధ్య మర్రిచెట్టుక్రింద అనుకోకుండా కనిపించి ఆశ్చర్య పరచింది.

ఈ బొమ్మల్లో ఏముంది ? తాడిచెట్టు, దానిని  ఎక్కుతున్న వ్యక్తి ఎడమ ప్రక్క స్పష్టంగా దీనిలో కనిపిస్తారు. అతని నడుముకు బందెం వుంటుంది. అతని నడుముకు వెనుకగా కట్టుకున్న లొట్టె (కుండ) బాగా కనిపించేలా చెక్కారు. తాడి మొదట్లో వాడిన నిచ్చెన తాటి చెట్టుకు ఆరు ఆకులూ రెండు కాయలూ కనిపిస్తున్నాయి. దానికి మరికొంచె కుడిగా వస్తే పై భాగాన ఒక చిలుక ఒక స్థంభం పై నిలబడి వున్నట్లు కనిపిస్తోంది. చిలుకే అనేందుకు ఆధారంగా దాని ముక్కు స్పష్టంగా తెలుస్తోంది. చిలుకకు దిగివ భాగంలో శివలింగం వుంది.   అంతకు మరికొంచెం కుడివైపుగా చూస్తే ఒక గుర్రపై కూర్చున్న స్త్రీ,పురుషులున్నారు బహుశా మహారాజ కుటుంబం అనుకునేందుకు అనువుగా వారి వస్త్ర ధారణే కాక వారిపై పట్టిన చత్రం తెలియచేస్తోంది. మహిళను ముందు కూర్చో పెట్టుకున్నారు. పురుషుడు వెనుకగా కూర్చున్నారు. అయితే ఈ గుర్రాన్ని స్వారీ చేస్తున్నట్లుగా కాక ఉత్సవాల సందర్భంగా ఊరేగింపుగా తీసుకెళుతున్నట్లు గుర్రపు కళ్ళేన్ని ఒక సైనికుడు కావచ్చు పట్టుకుని నడిపిస్తున్నాడు అతని ఎడమ చేతిలో కళ్ళేం వుండగా కుడిచేతిలో ఒక కత్తిని ఎత్తి పట్టుకుని వున్నాడు.


మొత్తం ఈ శిలా శాసనాన్నికి ఒక పట్టీలాగా ప్రేమ్ బోర్డరు ఇచ్చినట్లున్నారు.ఆ బొర్డరులో క్రింది వైపు మళ్ళీ కొన్ని బొమ్మలు చెక్కి వున్నాయి.

చెక్కి వున్న అక్షరాలు : చిలుకకూ గుర్రం పై వస్తున్న వ్యక్తులకూ మధ్యలో కొన్ని అక్షరాలు చెక్కి వున్నాయి. వాటిని జాగ్రత్తగా కూడబలుక్కుని చదివి చూస్తే ‘‘ పల్లగాని సాంబ సివుడు’’ ( శి బదులు సి అనే చెక్కారు) అనివుంది. ఇప్పటికీ ఆ ఊరిలో పల్లగాని ఇంటిపేరు గలవాళ్ళు వున్నారు. వారి అంచనా ప్రకారం ఆ శిల్పాన్ని చెక్కింది. పల్లగాని సాంబశివుడే అందుకనే అతని పేరు దానిపై చెక్కాడు అంటున్నారు. పేరులోని సాంబ శివుడు శివభక్తుడనేందుకు ఉదాహరణగానే తెలుస్తోంది.

ప్రదేశం : ( 17.077972,   80.805656 )

ఎక్కడుంది ? : సత్తుపల్లినుంచి విజయవాడకు వెళ్ళే దారిలో మర్లపాడు దాటిన తర్వాత ఖచ్చితంగా 4 కిలోమీటర్ల దూరంలో, కృష్ణరావు పాలెం కంటే 4 కిలోమీటర్ల ముందు వున్న కిలో మీటర్లను సూచించే R&B కిలోమీటరు రాయికి పక్కనున్న పొలాలలోని పెద్ద మర్రిచెట్టు మొదట్లో ఈ శాసనం కనిపిస్తుంది.
ఎందుకు పెట్టారక్కడ ? తాతల తరాల నుంచి ఈ విగ్రహం వుందని, గౌడ కులానికి సంభందించి మంచిని చేసే దేవతా శిల్పంగా, కాటమయ్యగా ఈ శాసనాన్ని కొలుస్తామని అక్కడి స్థానికులు చెపుతున్నారు. తాళ్ళు గీసే పండుగకు ఉత్సవంలా చేస్తారట. అంటే  గతంలో రొడ్డుకు అవతలి వైపున వుండేదట తర్వాత ఈ చెట్టుక్రిందకు తీసుకువచ్చారు.

కాటమ రాజా ? లేక సర్వాయి పాపన్న కావచ్చా లేక మరెవరైనా శివభక్తుడైన గౌడ వంశానికి చెందిన రాజా?
 స్థానికులు అది వారి కాటమయ్య దేవుడని చెపుతున్నారు. కానీ 13వ శతాబ్ధానికి చెందినదిగా చెపుతున్న చారిత్రక కాటమరాజు కథలో వున్న రాజు యాదవ రాజు అయితే అతని కథలోనూ చిలుకకు ప్రాముఖ్యత వుంది.

ఇకపోతే మన ప్రాంతాలలో గౌడ కులస్థులు ఆరాధ్యదైవంగా కొలిచే కాటమయ్య అంటే శ్రీ కంఠమహేశ్వర స్వామినే అతని భార్య పేరు సురమాంభ దేవి.

అలాగే వరంగల్ జిల్లా జనగాం దగ్గర కైలాష్ పూర్ లో పుట్టిన యోధుడు  సర్వాయి పాపన్న  పరమ శివభక్తుడు, గౌడకులానికి చెందిన వాడు పైగా ఇతనికి కూడా చిలుకను ఇష్టంగా పెంచుకున్న చరిత్ర వుంది. కోటలను ఆక్రమించాడు. ఉత్సవాలు జరిపించాడు. ఏదైనా ఉత్సవం సందర్భంలో ఇటువంటి శాసనం చెక్కించి వుంటాడా అనే అనుమానాలకు ఈ ఆధారాలు అవకాశాన్ని ఇస్తున్నాయి.

అలాగే కౌండిన్యులు అని పిలువబడే రాజవంశం గౌడకులానికి సంభందించినదే. కౌండీన్య మహఋషి ని వంశ మూల పురుషునిగా భావిస్తారు. వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మ దేవుని నుండి కౌండీన్య మహఋషి, జననము ద్వార పంచ గౌడులు అనగా పంచ రుషులు జన్మించుట, అలాగే శివుని వలన కంఠమహేశ్వరుడు జన్మించారు అని చెపుతారు. పంచగౌడులలో గౌడులు, సారస్వతులు, కాన్యకుబ్జగౌడులు, ఉత్కలులు మైథిలులు అని అయిదు తెగలు ఉన్నవి. వీరుక్రీ.శ.12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారత దేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. వీరిలో కన్నడ దేశాన్ని పాలించిన కెంపెగౌడ ముఖ్యమైన వాడు ఇతను 1513 నుంచి 1569 వరకూ పాలించాడు. ఈతని గురించి చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం భారతదేశంలో ప్రధాన నగరంగా ప్రసిద్ధి పొందిన బెంగళూరును స్థాపించింది ఇతనే. కెంపె గౌడ వంశీకులు 18వ శతాబ్దము వరకు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. మరి వారిలో ఎవరైనా ఖమ్మంజిల్లాలోని ఈ ప్రాంతాన్ని పాలించి వుంటారేమో చరిత్రలోకి తరచి చూడాలి. లేదా అసలీ విగ్రహమే ఎక్కడినుండయినా తరలించుకు రాబడినదైనా అయ్యి వుండాలి.
మీరూ ఈ శాసనాన్ని చూడాలనుకుంటే లోకేషన్ పట్టుకునేందుక ఈ మ్యాప్ ఉపయోగపడుతుంది.

(సశేషం మరిన్ని వివరాలు మరికొంత పరిశీలన తర్వాత జతచేస్తుంటాను. మీకేమైనా తెలిస్తే దయచేసి పంచుకోండి)

ఆ కనిపించే చెట్టుక్రిందనే ఈ శాసనం వుంది.


పల్లగాని సాంబసివుడు - అనే అక్షరాలు కనిపిస్తున్నాయా?

పల్లగాని వంశస్థులతో మాటామంతీ రికార్డింగ్ చేస్తూ

పండగ ఎలా చేస్తారో చెపుతున్న పల్లగాని వంశీయుడు

ఇది కాటమయ్య విగ్రహమే.  ఆలేరు దగ్గర  టంగుటూరుకు చెందినది
సర్వాయి పాపన్న 



















కామెంట్‌లు

  1. చాలా ఆసక్తికరంగా ఉంది... అసలీ శిల్ప- శాసనం గురించి మొదట మీకెలా తెలిసింది? వెతుకుతున్న శాసనం అనుకోకుండా చెట్ల మధ్య కనపడటం ఇంకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ విశేషాలు కూడా పంచుకోండి... (చాట్ర్రాయి మా సొంత ఊరు... అందువల్ల కూడా ఆ ప్రాంతంలోని ఈ శాసనం ఉదంతం నాకు ఆసక్తిని కలిగిస్తోంది..)

    రిప్లయితొలగించండి
  2. Etuvanti sasanamulu meeru kandukuru lo vethakandi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందుకూరులో మీరేమైనా ఇప్పటికే గమనించి వుంటే వివరాలు ఇవ్వగలరు. గతంలో దొరికిన తెలంగాణ ప్రాంత శాసనాలలో చినకందుకూరు అనే పేరు వినిపిస్తుంది కానీ అది మధిర దగ్గరలోనిదా లేక వేంసూరు మండలంలోనిదా అనేది గమనించాల్సి వుందండీ.

      తొలగించండి
  3. కాటమయ్య యాదవ రాజు అయితే గౌడులకు ఎలా సంబంధం ఉంది అంటారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాటమరాజు కథలోని యాదవరాజు కావడానికి అవకాశం లేదండీ. స్పష్టంగా కనిపిస్తున్న తాడిచెట్టు వంటివి గౌడకుల ప్రాతినిద్యాన్ని చూపుతున్నాయి.

      తొలగించండి
  4. చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామం లో కుడా ఇటువంటి శాసనం ఉంది

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి