మహా సరస్సు మాయం - గంగుల బాబు

మహా సరస్సు మాయం - గంగుల బాబు (విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, సత్తుపల్లి ఖమ్మం జిల్లా)

పావన గోదావరి మహారాష్ట్ర, నాసిక్ కొండలలో పుట్టి, చిన్న పెద్ద ప్రవాహాలను సుమారు ఒక వందను కలుపుకొని 'ఏలేరుపాడు' దాటేసరికి బృహదాకారమై దక్షిణాదిలోనే దొడ్డ నది అవుతుంది. అంతటి విశాలమైన నది గలగల పారుతూ ముందుకు పోతున్నకొద్దీ తూర్పున ఉన్న 'పాపికొండల' వరుసలు చేరువౌతుంటాయి. నది ఉత్తరపు ఒడ్డున 'భద్రాద్రి' నుండి పోచారం వరకు రోడ్డు సౌకర్యం ఉన్నది. అలాగే దక్షిణపు ఒడ్డున 'బూర్గుంపాడు' నుండి 'కోయిదా' గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉన్నది. 'పోచారం', 'కోయిదా' గ్రామాలు గోదావరినదికి అద్దరి ఇద్దరి ఎదురెదురుగా ఉన్న గ్రామాలు. ఇక్కడ నుండే 'పాపికొండల' వరుసలు ప్రారంభమవుతాయి. కనుక నదికి ఇరువైపుల ఉన్న రోడ్డు అంతటితో ఆగిపోతుంది.

నదిలో మరికొంత దూరం వెళ్ళగానే ఆ కొండల నడుమ నదికి దక్షిణపు ఒడ్డున ప్రసిద్ధ యాత్రాస్థలం 'పేరంటాల పల్లి' వస్తుంది. అక్కడి నుండి ఉత్తర, దక్షిణంగా వ్యాపించిన పాపికొండలు ఎదురు నిలుస్తాయి. ఇరువైపులా వ్యాపించి ఉన్న ఆ కొండల నడుమ నది తన వైశాల్యాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ మెలికలు తిరుగుతూ సాగుతుంది. మరి కొంతదూరం ముందుకు పోగానే v ఆకారంలో చీలిన 'పాపికొండల' శిఖర సమీపానికి వస్తాము. 'గోదావరీ తల్లి' ప్రార్థన మేరకు ఏ ఇంద్రుడో తన వజ్రాయుధంతో ఎదురొడ్డి నిలిచిన పర్వతశిఖరాన్ని ఛేదించి ముందుకు పోవటానికి ఏర్పాటు చేసిన చిన్న త్రోవ కాదు గదా! అన్నట్లున్న గండిలోనికి 'గోదావరి' ప్రవేశిస్తుంది. అంత పెద్ద 'గోదావరి' ఇంత చిన్న ఇరుకైన సందులో ఇమిడిపోయి ముందుకెలా వెళ్తుందా అనే ఆశ్చర్యం ఒక వంక, సామాన్యంగా నది విశాలంగా ఉన్నప్పుడు మెల్లగా ప్రవహిస్తూ ఇరుకవుతున్న కొద్దీ వేగం హెచ్చి, పెద్ద పెద్ద సుడులు తిరుగుతూ, నురగలు కక్కుతూ, హోరుమనే సవ్వడితో, పొగలు జిమ్ముతూ నదీ గమనం భయానకంగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఆ ఇరుకు సందులో నది ప్రవహిస్తుందా? లేక నిలిచిపోయిందా! అనే విస్మయం మరొక వంక మనస్సును తొలుస్తుండగా పాపికొండల గండిలో ప్రవేశిస్తాం. అక్కడ నది కదులుతున్నదా లేదా అనే సంగతి తెలుసుకోవాలంటే నీటిపై తేలే వస్తువును వేసి చూడవలసిందే. చాలా నెమ్మదిగా ఆ వస్తువు కదులుతూ ఉంటే ఓహో నది ముందుకు కదులుతూనే ఉందని అర్థమౌతుంది. పరిశీలనగా చూస్తే తప్ప కనిపించని నీటి చలనానికి విస్మయం చెందుతాము. ఆ చిన్న గండిలో నిలబడి (స్టీమరు మీద) రెండుగా చీలిన శిఖర దృశ్యాలను చూడాలంటే తలకు టోపీ గాని, తలగుడ్డ గాని ఉంటే అది కింద పడిపోతుంది. అంతగా తలపైకెత్తి వెనక్కు వంచి మరీ చూడాలి మరి. 

వానాకాలం నది వరదలలో ఉన్నంతకాలం అంటే ఆగస్టు నెల వరకు ఆ చిన్న గండి దగ్గర నది పాపికొండలను ఒరుసుకోవడం వల్ల అక్కడ నీరు గుండ్రంగా సుడి తిరుగుతుంది. నేర్పరి అయిన నావికుడు మాత్రమే తన నౌకను ఆ సుడిలో చిక్కుబడకుండా తప్పించుకొని ముందుకు తీసుకుపోగలడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆ సుడి నావను తన లోనికి లాక్కొని ముంచేస్తుంది. ఆ సుడి ముందు మరపడవలు కూడా నిలువలేవు.

పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చింది? : ప్రతి సంవత్సరం ఎన్నో పడవలు నైపుణ్యంలేని నావికుల వల్ల, కొందరు నావికుల అజాగ్రత్త వల్ల, మరికొందరి అతి జాగ్రత్త వల్ల, పడవలో ప్రయాణించే, ప్రయాణికుల తెలివి తక్కువతనం వల్ల పడవలు ఆ సుడిలో చిక్కుకుని పడవలోని ప్రయాణికులు ప్రాణభయంతో చేసే ఆర్తనాదాలతో ఆ పాపి కొండలు మార్మోగేవి. అలా మునిగిపోయిన అభాగ్యుల బంధువులు ఆ కొండలను చూచినపుడు ఈ 'పాపపు కొండల' గండే మావాళ్లను పొట్టన పెట్టుకున్నదని 'శాపనార్థాలు' పెట్టేవారు. ఆ పాపపు కొండలే పాపికొండలయ్యాయి! పెద్ద పెద్ద మర పడవలు వచ్చాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.


పాపికొండలే ఒకనాటి సరస్సుకు మూలం : పాపికొండల గండి నడుమ గోదారిలో నిలిచినపుడు గుండె గుభిల్లుమనిపించే ఈ గండి ఏర్పడకుంటే, 'గోదావరి' స్థితి ఎలా ఉంటుంది, దాని గమనమెటు? అనే ఆలోచన నాకే గాదు, ప్రతి ఒక్కరికీ వస్తుంది. వచ్చి తీరుతుంది. నిజమే.ఒకానొక కాలంలో ఈ పర్వతం ఏక ఖండంగానే ఉండి 'గోదావరి'ని నిలువరించి, వెనక్కు నెట్టిన ఫలితంగా ప్రాకృతిక పరమైన మహా సరస్సు ఏర్పడింది.


ఈ నది ఖమ్మం జిల్లాలోనికి వాయవ్య దిశ నుండి ప్రవేశిస్తుంది. ఉత్తరాన కొండలు పాపికొండల దాకా విస్తరించి ఉన్నాయి. పడమట 'మణుగూరు', 'ఇల్లందు', 'సింగభూపాలం' కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ కొండల నడుమ ఉన్న విశాల భూభాగం పల్లపునేల. ఇంత మేరకు సరస్సు ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమంతా ఆనాటి సరస్సులో మునిగి ఉండేది. ఈ సరస్సు గోదావరి నీటితో నిండి పోటెత్తిన నీరు, సరస్సు నిండగా అదనంగా వచ్చిన నీరు మత్తడి గుండా దిగువకు ప్రవహించినట్లుగా కిందకు ప్రవహించసాగింది. దక్షిణాన ఉన్న కనిగిరి కొండలు ఎర్రగుంట వరకు వచ్చి ఆగిపోతాయి. అక్కడి నుండి 'అశ్వారావుపేట' దిగువ వరకు ఆ సరస్సు నుండి వచ్చే నీటిని ఆపగలిగిన కొండల వరుసలు లేవు. అందువల్ల ఈ ఆగ్నేయ దిక్కు నుండి మిగులు జలాలు కిందకు పారేవి. ఈ సరస్సుకు వంగముత్యాలు బంజర దగ్గరలో ఉన్న ఎడ్లబంజరు, లంకపల్లి, సత్తుపల్లి నుండి అశ్వారావుపేట వరకు ఆగ్నేయ సరిహద్దు.

సత్తుపల్లి, గంగారం మధ్యన ఒక పాయ బయలుదేరి, ఏలూరు మీదుగా కొల్లేటి సరస్సులో, మరికొన్ని పాయలు పాలకొల్లు, నర్సాపురం మీదుగా వెళ్లి సముద్రంలో కలిసేవి. సత్తుపల్లి మెరక మీద నిలబడి ఆగ్నేయం వైపు చూస్తే, విశాలమైన నదీ ప్రవాహ ప్రాంతపు శిధిల రూపం కనుచూపు మేర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండవ పాయ దమ్మపేట, మల్కారం, అశ్వారావుపేట మీదుగా ప్రవహించి జంగారెడ్డిగూడెం, పోలవరం, రాజమండ్రి, కాకినాడ దాకా పాయలు, పాయలుగా విస్తరించి బంగాళాఖాతంలో కలిసేవి. మల్కాపురం గట్టు నుండి చూస్తే, విశాలమైన ఆ నదీ పరీవాహ శిధిలరూపాన్ని గమనించవచ్చు. ఇటు పాలకొల్లు, నర్సాపురం నుండి అటు కాకినాడ వరకు గల ప్రాంతమంతా అనేక పాయలు, పాయలుగా చీలి పారేవి. ప్రకృతి సవ్యంగా సహకరించి ఉంటే ఆ సరస్సూ, ఆ సరస్సు తీరం నుండి ఆగ్నేయంగా బయటకు వెడలిన ఆ రెండు పాయలు ఇప్పటికీ క్షేమంగానే ఉండేవి.


కాని ఊహించని ఉత్పాతం, బడబాగ్ని రూపంలో ఉప్పతిల్లింది. సరస్సులోని బడబాగ్నికి సరస్సు కింద ఉన్న భూమి కంపించి ఆ సరస్సుకు పోటుగా, అడ్డుకట్టగా నిలిచి ప్రస్తుతం మనం పాపికొండలంటున్న పర్వతం బీటలు వారి పెద్ద నెఱ్రె ఏర్పడింది. ఇంకేముంది సాగరంగా విస్తరించిన ఆ మున్నీరు ఒక్కుమ్మడిగా దూసుకుని వచ్చే ఆ ప్రవాహపుటుధృతికి ఆ నెఱ్ఱె ఇంకొంత ఎడమైంది. దీనివల్ల సరస్సు ఎండిపోయింది. ఈ సరస్సు నుండి ఆగ్నేయంగా సముద్రం వైపు పయనించసాగింది. సరస్సు అంతర్ధానమైనా అలనాటి ఆ సరస్సు శిథిల చిహ్నాలను మాత్రం విడిచి వెళ్ళింది.



ఆ మహా సరస్సుకు నిదర్శనాలేమిటి? : గోదావరిని నిలువరించిన కొండల వల్ల (పాపి కొండలు) పెద్ద సరస్సు ఏర్పడిందని, అది అగ్నిపర్వతం వల్ల భూమి కంపించి (భూకంపం) కొండ విరిగిపడి సరసు బదాబదలైందనటానికి నిదర్శనాలేమిటి? అని అడగటం సహజమే. ఈ ప్రశ్నకు సమాధాలివ్వటానికి ప్రయత్నిస్తాను.


1. పాపికొండలకు పడమట, 'భద్రాద్రి'కి తూర్పున 'గోదావరి' ఒడ్డున 'ఉష్ణగుండాల' అనే గ్రామం ఉంది. అక్కడ శీతాకాలం ప్రొద్దున్నే గోదావరి గట్టుకు వచ్చి చూస్తే, నది నీటి మీద మోళెం (నీటి ఆవిరి దట్టంగా) కొంతమేరకు ఆవరించి ఉంటుంది. ఎండాకాలం నదీప్రవాహం తగ్గుతుంది. చలికాలంలో మోళెం పట్టినచోట ఇసుకతిన్నెలో చెలమను తవ్వుతారు. చెలమలో ఇసుక కూలి చెలమ(గొయ్యి) పూడిపోకుండా తడికెలు ఏర్పాటు చేస్తారు. అందులో ఊరిన నీరు మహావేడిగా ఉంటుంది. బియ్యం కొద్దిగా మూటగట్టి ఆ నీటిలో వేస్తే ఉడికి అన్నం తయారవుతుంది. ఆ వేడి నీటిని తోడుకుని చన్నీళ్లతో కలిపి స్నానం చేస్తారు. ఆ నీటి వల్ల అన్ని రుగ్మతలు (వ్యాధులు) పోతాయని అంటారు. ఆ వేడి నీటి గుండం వల్లే ఆ ఊరికి 'ఉష్ణగుండాల' అని పేరొచ్చింది. అదే అగ్ని పర్వత కేంద్రం.


1986లో ఒకమారు భూమి కంపించింది. దాని కేంద్రం ఈ ఉష్ణగుండాల అని శాస్త్రజ్ఞులు తెలిపారు. నేనప్పుడు కల్లూరులో ఉన్నాను. తిరిగి రాత్రి 8 గంటలకు బయ్య్.... మంటూ పెద్ద శబ్దంతో పాటు ఇళ్ళన్నీ ఊగటం మొదలుపెట్టాయి. అంతా హా-హా కారాలు చేస్తూ బయటకు వచ్చారు. భూకంపం కొన్ని సెకండ్లే ఉండటం వల్ల ప్రమాదమేమీ జరుగలేదు. కాని కల్లూరు నుండి భద్రాచలం వరకు ఇళ్ళ గోడలన్నీ బీటలు వారాయి. అక్కడి నుండి, అంటే ఉష్ణగుండాల నుండి, నేరుగా సత్తుపల్లి వస్తే గంగారం దాటిన తర్వాత మేడిశెట్టివారిపాలెం వస్తుంది. ఆ తర్వాత రోడ్డు వంకర తిరిగి తూర్పునకు అశ్వారావుపేట వైపు వెళుతుంది. ఆ వంక తిరిగిన చోటుకు శీతాకాలం రాత్రిళ్ళు కారులో రాగానే అద్దాలను మంచు మూసివేస్తుంది. వైపర్సును ఉపయోగించకపోతే దారి కనబడదు. ఫర్లాంగు ముందుకెళ్ళగానే మంచు మాయమవుతుంది. మోటారు సైకిలు మీద శీతాకాలం రాత్రిళ్ళు వెళితే చలికి కాళ్లు చల్లబడి చల్లగాలి కాళ్ళను పీడిస్తుంది. కాని ఆ వంక దగ్గరకు రాగానే వెచ్చటి గాలి సోకి హాయి అనిపిస్తుంది. అంటే ఆ వంపు కింద భూమిలో ఆరిపోయిన అగ్నిపర్వతం ఉన్నది. అదే రోడ్డున 20 కిలోమీటర్ల ముందుకు వెళితే అచ్యుతాపురం దాటాక ఒక గట్టు వస్తుంది. అక్కడా ఇదే స్థితి. ఆ గట్టు కింద అణగారిపోయిన అగ్ని పర్వతం ఉన్నది.

అక్కడ నుండి విజయవాడ వస్తే కృష్ణానదికి ఆవలిగట్టున పానకాల నరసింహస్వామి దేవాలయం గట్టు కింద మరో అగ్నిపర్వతం ఉన్నది. ఆ స్వామి నోట్లో బెల్లం పానకం పోయటం వల్ల వేడికి బెల్లం చిట్లెం గట్టి రాయిగా మారి అగ్నిపర్వతం అగ్నిపైకి చిమ్మకుండా ఉంటుందని మన వారి నమ్మకం. అక్కడి నుండి తిన్నగా ఒంగోలు వెళితే ఊరవతల గట్టు కింద ఆరిపోయిన మరో అగ్నిపర్వతం ఉన్నది. పూర్వం గోదావరి సరస్సుగా మారిన చోటు నుండి ఒంగోలు వరకు ఒకే వరుసలో అగ్ని పర్వతాలున్నాయని తెలుస్తుంది. అగ్నిపర్వతం వల్ల కలిగిన భూకంపంతో సరస్సు మాయమైందనటానికి ఆరిపోయిన అగ్నిపర్వతాలు నిదర్శనమే గదా!


2. లక్షల సంవత్సరాలుగా ఆ సరస్సును గోదావరి ఇసుకతో నింపటం వల్ల కింది పొరల ఇసుక గట్టిపడి రాతిపొరగా మారింది. సరస్సుకు సరిహద్దులుగా నేను చూపిన పర్వతాల ఇద్దరిన అంటే సరస్సు ఉన్న వైపున ఇసుక, ఇసుకరాయి ఉంటే, ఆ పర్వతాల ఆవలి వైపున ఇటువంటి ఇసుక గాని, ఇసుకరాయి గాని కనబడదు. సరస్సు ఆవరించిన పల్లంలో దొరికే ఇసుకరాయి ఖమ్మం జిల్లాలో, ఇక్కడ గాక మరొక చోట మచ్చుకైనా దొరకదు. అలాగే ఇక్కడా ఇసుక కూడా కన్పించదు. అశ్వారావుపేట నుండి ఇల్లందు వరకు కల్లూరు కనకగిరి కొండల నుండి భద్రాద్రి వరకు ఎక్కడ చూసినా ఇసుక, ఎక్కడ తవ్వినా ఇసుకరాయి కన్పిస్తాయి. ఇదీ ఒక నిదర్శనమే గదా! ఒకనాడిది సరస్సు అనడానికి.


3. కనకగిరి కొండల నుండి తెల్లవాగు, సింగభూపాలం కొండల నుండి 'గొదమవాగు', ఇల్లందు కొండల నుండి 'నల్లవాగు', 'తెల్లవాగు', 'ఎఱ్ఱవాగు' కొత్తగూడెం వద్ద కలిసి 'కిన్నెరసాని', గోదావరికి ఉత్తరపు కొండల నుండి తాలిపేరు, శబరి, అశ్వారావుపేట నుండి 'పెద్దవాగు' ఇవన్నీ గోదావరిలో కలుస్తాయి. నలువైపుల నుండి విస్తరించి ఉన్న కొండల వాలు గోదావరి వైపు ఉండటం వల్లనే గదా! అక్కడి నుండి వచ్చే ప్రవాహాలన్నీ గోదావరిలో కలుస్తున్నాయి. అంటే నలువైపులా విస్తరించిన కొండలు ఆ సరస్సుకు సరిహద్దులు అనుకోవచ్చు గదా!


4. ఆదిమానవుల అవశేషాలు గాని పాత, కొత్త రాతియుగాలకు చెందిన మాన సంస్కృతీ చిహ్నాలు గాని, ఈ సరస్సు విస్తరించిన లోయలో కానరావు. కాని ఈ సరస్సుకు దక్షిణ హద్దుగా ఉన్న కనకగిరిగి దాపున అంటే దక్షిణాన కల్లూరున్నది. దాని సమీపంలో 'వెన్నవలి' గట్టు దిగువన రాకాసి గుళ్ళున్నాయి. ఆదిమానవులు తమ తెగలో చనిపోయిన వారి కొరకు భూగృహాన్ని ఏర్పాటు చేసి అందులో శవాలను పూడ్చి, పెద్ద పెద్ద బండలు దానిచుట్టూ వలయాకారంలో అమరుస్తారు. దానినే మనవాళ్ళు తెలియక రాకాసి గుళ్ళన్నారు. అటువంటివే ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో బయటపడ్డాయి.


కాని పాపికొండల నుండి సరస్సు విస్తరించిన ఏ ప్రాంతంలోనూ ఇంత వరకు అటువంటి రాకాసి గుళ్లు కనబడలేదు. అంతేగాదు నలుదిక్కులా కొండల నడుమ ఏర్పడిన సరస్సు అనదగిన ప్రాంతంలో మరెక్కడా మనకు కనిపించని ఇసుక-ఇసుక- ఇసుకే కనిపిస్తుంది. కిందంతా ఇసుక రాతిపొరలే తప్ప, పాత కొత్త రాతి యుగానికి సంబంధించిన ఏ చిహ్నాలూ లేవు. సరస్సు గనుక, ఉండే అవకాశమూ లేదు.


ఉష్ణగుండాల నుండి ఒంగోలు వరకు అగ్నిపర్వతాల వరుస గలదని వీటివల్ల ముఖ్యంగా ఉష్ణగుండాల, సత్తుపల్లి సమీపంలో ఉన్న అగ్నిపర్వతాలు గల్గించిన భూకంపమే పాపికొండల పతనానికి కారణమై అలనాటి మహాసరస్సు కనుమరుగై తన ఉనికిని తెలియచేస్తే పైన ఉసుక, లోపల ఇసుకరాయి పొరలను మాత్రం వదిలి వెళ్ళిందని చెప్పవచ్చు.

సరస్సు అంతర్థానమైనదెప్పుడు? : ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ సరస్సు ఉత్పాతానికి గురైందెప్పుడనేది ఊహించడం కష్టమే. పాతరాతి, కొత్త రాతి యుగపు ఛాయలేమీ లేవు కనుక అప్పటికే సరస్సున్నది, గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలలో కొన్ని నెల్లివాక, ఆలుబాక, తూరువాక, కివ్వాక అనే పేర్లతో ఉన్నాయి. వాక-వాగుగా మారింది - చరిత్రకందని రోజుల్లో వాక అనే పదముండేదని అది వాగుగా మారిందని ఊహించవచ్చు. కివ్వాకలోని కిరు -చిరుగా మారుతుంది. అట్లే కెరె - చెరువు, కివి-చెవిగాను మారాయి. ఈ 'క'కారం తాల్వీకరణ చెంది 'చ'కారంగా మారటం 'క్రీస్తు'కు పూర్వమే మొదలైంది. అంటే అప్పటికే ఇక్కడ జనావాసాలున్నాయి. మహాభారతానికి, రామాయణ కాలానికి చాలా ముందే ఈ సరస్సు మాయమైంది. అంటే రామాయణ కాలానికి ముందూ కొత్త రాతి యుగానికి తరువాత ఈ మధ్యలో ఎప్పుడో ఈ సరస్సుకు ఉపద్రవం ఏర్పడింది. ఇంతకంటె కచ్చితంగా, భౌగోళిక శాస్త్రజ్ఞులూ, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళూ చెప్పగలరేమో!


విశ్వవిద్యాలయాల్లో భూగోళ శాస్త్రాన్నీ, సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల్లారా! అధ్యాపకులారా! ఈనాటి మానవుడు తన మేధతో కృత్రిమ సరస్సుల నిర్మాణానికి పూనుకున్నాడు. అందులో భాగమే 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణం. రాబోయే ఈ సరస్సు అలనాటి సరస్సులో నాలుగవ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఖమ్మం జిల్లాలోనే 250 ఊళ్ళు జలసమాధి కానున్నాయి. నేను తెల్పిన మహా సరస్సుకు సంబంధించిన ఆనవాళ్లు చాలావరకు నాశనమైపోనున్నాయి. కనుక మీరు త్వరపడి, చరిత్రకందని కాలంలో ఈ పాపికొండల వల్ల మహా సరస్సేర్పడెనా? ఏర్పడితే దాని వివరాలేమిటి? మరెప్పుడెలా నాశనమైంది అనే దానిపై పరిశోధించి నిజాన్ని నిగ్గు దేల్చండి. అందుకు కొంతైనా నా వ్యాసంలో నేను చూపిన అంశాలు ఉపకరిస్తే సంతోషిస్తాను.


చరిత్ర విద్యార్థులారా! కొత్తగా నిర్మాణం కాబోయే సరస్సులో ఎన్నో చారిత్రక సత్యాలు, సంఘటనలు, శాశ్వతంగా జలసమాధి కానున్నాయి. ఉదాహరణకు రుద్రమ్మకోట. 'కాకతి రాణి రుద్రమ్మ' తన భర్త వీరభద్రుని తిరుగుబాటును అణచటానికై ముసునూరి వీరుల అండదండలతో ప్రస్తుతపు రుద్రమకోట గ్రామం వద్ద కోట కట్టి అక్కడ ఒక సైనిక శిబిరం ఏర్పరచిందనీ, ఆ తర్వాత అది ఆమె పేర ప్రఖ్యాతమైందని, వీరభద్రుని ఆ ప్రాంతాననే ఓడించి సంహరించిందనీ చారిత్రకుల విశ్వాసం. రాణి రుద్రమ తాను వేయించిన ఏ శాసనంలోనూ తన భర్త వీరభద్రుని ప్రస్తావించకపోవడం వల్ల, వీరభద్రుని తల్లి ద్రాక్షారామంలో వేయించిన శాసనంలో తన కుమారునికి ఉత్తమ గతులు కలగాలని, ఆ దేవునికి ఇచ్చిన దాన శాసనంలో తన కోడలిని తలచకపోవడం వల్ల వీరభద్రునిది సహజ మరణం కాదని, భార్యాభర్తల పోరులో వీరభద్రుడు అసువులు బాశాడనీ పలువురు భావిస్తున్నారు. మీరు పరిశోధిస్తే అక్కడక్కడ శాసన సాక్ష్యాధారాలు దొరకవచ్చు. ప్రస్తుతం కన్నాయిగట్టు వద్ద ఒక శాసనం ఉంది. మీరు తొందరపడక, అలక్ష్యం చేస్తే ఎంతో చారిత్రక సంపద, చారిత్రక సత్యాలు నీటి పాలు కానున్నాయి. వెంటనే పరిశోధనకు పూనుకొనలసినదిగా మనవి.


వ్యాసకర్త ప్రత్యేక విన్నపం : ► నేను భూగోళశాస్త్రంలో గాని, సివిల్ ఇంజనీరింగ్ లో కాని పరిజ్ఞానం లేనివాణ్ణి. నా వ్యాసంలో అసంగతాలేమైనా ఉంటే తెలిసినవారు తెలియజేస్తే సవరించుకుంటానని మనవి.

కర్టెసీ: నాకు తెలుగు పాఠాలు చెప్పిన గురువుగారు
శ్రీ గంగుల బాబు గారు వారి అనుమతితోనే
ఈ వ్యాసాన్నిక్కడ అందించటం జరిగింది.




కామెంట్‌లు

  1. చారిత్రికాంశాల సేకరణలోను, వాటిని అందరికీ పంచడంలోనూ విశేషమైన కృషి చేస్తున్న మీకు హృదయపూర్వకాభినందనలు శ్రీనివాస్ గారూ !

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి