గోదావరి ...తెలివాక – శ్రీ గంగుల బాబు

    ఈ మధ్య తెలుగు ఉత్పత్తిని గూర్చి,ఇంతకు ముందటి పండితులెవ్వరు తెల్పనిరీతిలో అందరి అభిప్రాయాలకు భిన్నంగా తెలుగుదేశం అచ్చరు వందే విధంగా గోదావరి నదికి పూర్వనామం “తెలివాహ” అని శ్రీ సంగనభట్ల నర్సయ్యగారు సంచలనం కలిగించే రీతిలో ప్రకటించటమూ ,వారి అభిప్రాయాన్ని శ్రీ యార్లగడ్డ బాలగంగాధరరావు,లగడపాటి సంగయ్యగార్లు, గోదావరికి పూర్వమున్న పేరేమిటో తెల్పకపోయినా, తెలివాహ మాత్రం ససేమిరా కాదంటూ వ్రాసిన వ్యాసాలు పత్రికాముఖంగా చదివి, సంగనభట్ల వారే ప్రత్యాఖ్యానం చేయనందున,నిజమే కాబోలనుకుని ,ఆ సంగతే మర్చిపోతున్న సందర్బాన,నేను ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో బస్సుదిగి,అటుగావస్తున్న రైతును ఆపి అయ్యా ఆరళ్లపాడుకు ఎటువెళ్ళాలి అని అడిగాను.అందుకాతడు ఆ తెల్లాగు దాటితే ఆ ఒడ్డునే వుంది అని అంటూ ఆ దిక్కు చూపాడు. తెల్లాగు అన్న పదం చిత్రంగాతోచి ఏందాటి వెళ్లాలి అని మళ్లీ అడిగాను. అదేనండి అల్లదిగో కనబట్టంలే! తెల్లాగు దానిఒడ్డునే ఉన్నదండి అని అన్నాడు.తెల్లవాగు ‘తెల్లాగు’ అయింది.తెలుగు యేల కారాదు అనుకొని సంగనభట్ల వారి అభిప్రాయం సరియైనదేనా!తెల్లవాగుకు తెలివాహకు సంబంధమేమైనా ఉన్నదా? అని ఆలోచిస్తున్ననాకు గోదావరి ఒడ్డున గల కొన్ని ఊళ్ళు మదిలో మెదిలి, అవి నా ఆలోచనలకు మరింత వూతమిచ్చాయి.నా అభిప్రాయాలను తెలుగు అభిమానుల ముందుంచుతున్నాను.



    ఇందులో  ఒకరిని విమర్శించడం కాని,మరొకరిని సమర్ధించటంగాని గాదని మనవి.

      అన్నిటికంటేముందు ఏరువాక అనే పదాన్ని చూడండి.ఏరు అంటే నీరు,వాక అంటే నీటి ప్రవాహం అని అర్థం. కాని,వర్షాకాలం ప్రారంభంలో వర్షం,వరదా రాగానే వ్యవసాయపనులు ప్రారంభమవుతాయి గనుక ఏరువాక అంటే నీటి ప్రవాహము అను అసలు అర్థానికి బదులు వ్యవసాయపనులు  ప్రారంభంఅనే అర్థం స్థిరపడింది.పూర్వం ఏరు అంటే నేటి వాగుకు పర్యాయపదంగా గాక,నీరు అని అర్థం. ఇప్పటికీ కోయజాతి వారు నీరు అనా మనం ప్రయోగించే చోట యేరు అనే ప్రయోగిస్తారు. మనం కూడా ఒకప్పుడు నీరును యేరుఅనే వాళ్లం. కోనేరు,కొల్లేరు,పెన్నేరు గడ్డ(ఇది అడవుల్లో దొరికే మూలిక.దీనిలో నీటి శాతం ఎక్కువ) ఈ పదాల్లోని ఉత్తరపదమైన ఏరును ప్రవాహము అనలేముగదా!కనుక మనం కూడా ఒకానొక కాలంలో నీరును ఏరు అనేవాళ్లం. ఈ ఏరు నుండి నీరు అనే పదం ఏర్పడిందని చెప్పడానికి మరొక వ్యాసం అవసరమౌతుంది.కనుక  అనావశ్యకమైన  ఆ చర్చజోలికి పోక ,ఏరంటే  నీరని తర్వాత తర్వాత అర్థ విపరిణామం చెంది ఏరు వాగుకు పర్యాయపదమైందని మనవి చేస్తున్నాను.వాగు ప్రాచీన పదం.ఏరు అర్వాచీనం.


   వాగుకంటే వాక, వాక కంటే వాప్రాచీనమైంది. తెలుగు ద్రావిడజన్యం. ఈ ద్రావిడ భాషలో బరుఅనే ధాతువునకు వచ్చు అని అర్థం. కన్నడ భాషలో (ఈ పదం యదాతధం గానే వుంది. తమిళ,మళయాళ,కోయ భాషల్లో మాత్రం వరా అయింది.వబ-యోర భేద అంటే వ-బ లకు భేదం లేదు కనుక బరు-వర అయింది.మన తెలుగులో కూడా ఒకప్పుడు వర అనే పదం ధారాళంగా ఉపయోగించారనడానికి ప్రస్తుతం మిగిలిఉన్న కొన్ని ఉదాహరణలు చూపిస్తాను.ఒకటి వారెవా అంటే రా రమ్మని  అర్థం. కాని అర్ధం విపరిణామం చెంది మెచ్చుకోలుకు  అర్థం గా స్థిరపడింది.రెండవది అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చటంలోని  వాఱు అనే పదం మూడవది తెలవాఱు, పై మూడు వాక్యాలలోని వరు అనే పదాలు బరురూపాలే .ఈ వరువిడదీసి కూడా ప్రయోగాలున్నాయి.రా అంటే ఇటు రమ్మని అర్థం .అట్లే వా అంటే ప్రవాహము అనే అర్థంలో ఏకాక్షర పదంగా ప్రయోగించాము,. ఏరువాక అంటే నీటి ప్రవాహము.వాక అంటే ప్రవాహము.వాకలోని విభక్తి.ఈ విభక్తి చేరకముందు  వాప్రవాహానికి ఏకాక్షరపద ప్రయోగం.తరువాత  విభక్తి చేరి వాక ప్రవాహానికి అర్థంగా స్థిరపడింది.

  గోదావరికి వాకఅనే పేరున్నదా! ఉన్నదనే చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలో గోదావరి ఒడ్డున గల కుకునూరు దాపున కివ్వాక అనే గ్రామమున్నది.దీన్ని విడదీస్తే కిఱు+వాక.కిఱు అంటే చిన్న అని అర్థం. క,గా తాలవ్యీకరణ చెందక పూర్వం క్రీస్తుకు ఎంతో ప్రాచీన కాలానికి చెందినదీ గ్రామం ఈ పేరు ఈ నాటికీ అలానే నిలచి వున్నది. ఈ పేరే దాని ప్రాచీనతను తెలుపుతుంది. ఈ నాడు మనం కిఱు అనం కై-చేయి, కివి-చెవి, కెఱె-చెరువు అలా కారం చకారంగా తాతవ్యీకరణ చెందిన రూపాలనే వాడుతున్నాము. కవ్వాక పద ప్రాచీనతను తెలపడానికే ఈ వివరణ.

కిఱు వాక అంటే చిన్న పాయ అని అర్ధము. అక్కడొక నాడు గోదావరి రెండుపాయలుగా పారే రోజుల్లో చిన్నపాయ ఒడ్డన ఉన్నఊరు కివ్వాక కాలవశాన ఆ రెండు పాయలూ ఒకటైన ఆ పేరు అలానే నిలచివుంది. అంటే ఒక నాటి గోదావరికి వాక అనే పేరుందని చెప్పటానికీ ఉదాహరణ చాలు.

గోదావరికి కేవలం వాక అనే పేరే ఉండేదా? లేక విశేషణ పదం ఏదైనా వుందా? తెల్ల అనే పూర్వ పద విశేషణమున్నట్లు ఈ క్రింది ఉదాహరణల వల్ల తెలపవచ్చు.

తెల, తెలి, వెల, వెల్లి, యల్ల వెండి, వెలుగు-తెలుపు నకు పర్యాయపదాలు మన కృష్ణ నీరు నలుపుగా వుంటే, మన గోదావరి నీళ్ళు తెల్లగా వుంటాయి. కృష్ణ అనేది సంస్కృత పదం. అర్ధం నలుపు. ఇప్పటికీ కన్నడ పల్లీయులు దీన్ని కరిహోళే అంటారు. నల్లవాగు అని అర్ధం. దీన్ని సంస్కృత ప్రియులు కృష్ణానదిగా సంస్కృతీకరించారు. కృష్ణనీరు నల్లగా వుంటే, గోదావరి నీరు తెల్లగా వుంటాయి. గనుక మన పూర్వీకులు తెల్లవాక-తెలవాక అనే వారని తెలప వచ్చు. ఎలాగో వివరిస్తారు.

ఖమ్మంజిల్లాలో గోదావరికి ఎగువన గోదావరి ఒడ్డున ‘‘నెల్లివాక’’ అనే ఊరున్నది. దాని అసలు పేరు ‘‘వెన్నెల వాక’’ వె రాలిపోయి నెలవాక-నెలివాక- నెల్లివాక అయ్యింది. వెన్నెల అంటే తెలుపుకు పర్యాయపదం కదా?

అక్కడినుండి ఇంకా దిగువకు వస్తే ఆలుబాక అనే ఊరు గోదావరి ఒడ్డున వుంది. దాని మొదటి పేరు యల్లవాక-యలవాక అయివుండాలి. యల్లవాక – అల్లవాక- అలబాక- ఆలుబాక గా మారింది. యల్ల అంటే తెలుపుకు పర్యాయమే కదా!

మరింత దిగువకు వచ్చి భద్రాద్రి వారధి పైనుండి ఉత్తర దిక్కునకు చూస్తే 2.5 కి.మీ దూరంలో నదిమధ్య కొండ ఆ కొండపై కోవెల కనిపిస్తుంది. గోదారి లోతుగా గాడి కోయక నెరసి పారే పూర్వపు రోజుల్లో ఆకొండ చుట్టూ విశాల మైన నేల, అక్కడొక ఊరుకూడా వుండివుండాలి. ఎందువల్లనంటే ఆకొండ చుట్టూ అక్కడక్కడా కుండపెంకులు కానవస్తాయి. బహుశా ఆకొండను ఆవరించి ఊరుకు ఇరువైపులా వెండిలాంటి తెల్లని గోదావరి పాయలు ప్రవహించడం వల్ల ఇరువెండి అనే సార్ధక నామధేయం ఏర్పడి ఉంటుంది. గోదారి గాడి క్రమంగా లోతుగా కోయటంతో కోతకు గురియై నేల తరిగిపోవటంతో అక్కడ మనుగడ కష్టమై ఆ ఊరును గోదారి పశ్చిమపు టొడ్డున ఎత్తైన ప్రదేశం మీద తిరుగ గట్టిన దానికి ఇరువెండి అనే పూర్వపు నామాన్ని మార్చలేదు. ఇప్పటికీ ఇరువెండి అనే పిలుస్తారు. వెండి అంటే తెలుపుకు పర్యాయపదమే కదా!

ఇటువంటి పేర్లు మనకు కొత్తేమీ కాదు. విష్ణుకుండిన విక్రమేంద్ర వర్మ తుమ్మల గూడెం, 5వ శతాబ్ధి శాసనంలో ఇరన్డేరు అనే ఊరును అమరావతిలోని బౌధ్ధ బిక్షుక సంఘానికి దానం చేసినట్లున్నది. (విష్ణుకుండినులు-శ్రీనేలటూరి వెంకటరమణయ్య గారు) ఇరండేరు అంటే రెండువాగులు. అనగా రెండువాగుల మధ్య వున్న ఊరు అట్లే తమిళనాట ఈరోడ్ అనే పట్టణం. రెండు వాగులమధ్య నున్నది. ఓడ్ అంటే వాగు అని అర్ధం. ఇరు ఓడ్ ఈరోడ్ అయ్యింద. ఓడ్ పూర్వ రూపం వాఱు ఈ వాఱు పదాన్ని ఇప్పటికీ ప్రయోగిస్తున్నామని ఇంతకు ముందే తెలిపినాను. అనే అక్షరం – డ,ట,ర,ల గా మారుతుంది. ఱ-డ గ మారి వాఱు-వాడ్ ఓడ్ గా మారింది. నీరోడుతుంది. రక్తం ఓడుతుంది. అనే పదాలు ఇంకా మననుండి దూరంకాలేదు.

భద్రాద్రికి ఇంకా దిగువకు వస్తే రుద్రమకోట ప్రక్కన ఏలేరుపాడు అనే ఊరువుంది. యెల్ల యేరు ఎలేరు-యెల్ల అంటే తెలుపనియే కదా అర్ధం.
ఇలా నెల్లివాక, ఆలుబాక, ఇరవెండి, ఎలేరుపాడు ఈ ఊళ్ళన్నీ గోదావరి, కొకనాడు, తెల్లవాక అనే పేరున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

    ‘సంగనభట్ల వారు బుద్దుని జాతక కథలలోని తెలివాహకు దక్షిణాన ఆంధ్రులున్నట్లు తెలిపినందున అది గోదారి కాక మరొకటి కాదని తెల్పగా,సంగయ్యగారు, తెలివాహ గోదావరి అని ఎందుకనుకోవాలి?ఒరిస్సాలోని మహానదికుపనది, కొకదానికి తెలివాహ అనే పేరున్నందున, గోదావరిని తెలివాహ అనడం  అసందర్భం, ఎంతమాత్రం అంగీకారంకాదు అని అన్నారు. వారు సంగనభట్ల వారి వ్యాసానికి ప్రముఖంగా చూపిన అభ్యంతరం కూడా అదే . మన గోదావరికి గంగ అని గౌతమి అని మరిరెండు పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లెలా వచ్చాయో తెలిపిన తర్వాత తెలివాహను గూర్చి చర్చిద్దాం, ఆంధ్రులు ఉత్తరాదినుండి వచ్చి, ఇచటి స్థానికులైన నాగజాతి వారిని ఓడించి, వారిని  సామంతులుగా జేసికొని శతాబ్దుల పర్యంతము అవిచ్చిన్నంగా పాలించారు. వారిక్కడ  స్థిరపడిన తర్వాత వారి మాతృభాష  అంటే ఆర్య భాష ,రాజభాషయై, మన స్థానిక భాషకు మన్నన కరువైంది.దానితో మన భాషకు  పాట్లు ప్రారంభమయ్యాయి. గంగానది పరమ పవిత్రమయినది. వారికత్యంత ప్రీతిపాత్రమైనది.
‘‘గంగా గంగేతి యన్నామయోజనానాం 

శతేప్యపి స్థిరేరుచ్చారితం  హన్తి పాపం జన్మత్రయార్జితం ’’
( విష్ణుపురాణం 2-8 )
నూరు యోజనాల దూరంలో ఉన్నా ‘గంగా గంగా’ అని రెండు మార్లుచ్చరిస్తే చాలు మూడు జన్మల పాపం పోతుందని అర్థం.

అంతటి భక్తితత్పరత గల వారు కనుకనూ, ఆపై తమ ప్రాంతీయ అభిమానంతోనూ మన తెలివాకను గంగ గనుక దీనిని గామార్చారు.  దీని ఉపనది  నొకదానిని పినగంగ అని మార్చారు. బహుశ: తమ కుటుంబంలోని వారిని ఆ ప్రాంతీయ సామంతునిగా పంపియుందురు. గంగ  మీద అభిమానంతో, ఇదివరకే తెలివాకను గంగగా మార్చారు గనుక దీనికి పినగంగ అని పేరు పెట్టి ఉంటారు. కనుకనే ఇప్పటికీ ఆదిలాబాదు, వరంగల్,కరీంనగర్ జిల్లావాసులు గోదావరిని గంగ అని వృద్దగంగ అని పిలుస్తారు.దీని ఉపనదిని పినగంగ అన్నారు గనుక దీనిని పెదగంగ అంటే మిశ్రమసమాసమవుతుంది గనుక వృద్దగంగ అని శిష్ట సమాసంగా మార్చారు కాబోలు, పోతన కూడా తన భాగవత పీఠికలో గంగంక్రుంకులిడి-యన్నది గోదావరిని గూర్చియేగాని ఉత్తరదేశంలోని గంగను గూర్చి కాదు.ఒక వేళ కాశికే వెళ్ళి ఆ గంగలో క్రుంకులిడి ఉంటే కాశికా విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని పరవశంతో వర్ణించి ఉండేవాడు. పైగా భాగవతంపై విమర్శ చేసిన పెద్దల అభిప్రాయంకూడా ఇదే. ఆ తర్వాత  ఈ గంగ పేరు వెనుకబడి గోదావరిగా మారింది.సంగనభట్ల వారి వ్యాసాన్ని ఖండించిన యార్లగడ్డ బాలగంగాధరరావుగారు ఉత్తరదేశాన ఉన్న గంగానది లోని ఒక దీవిపేరు గోదావరి అని, ఆ పేరే ఇక్కడ ఈ నదికి పెట్టారని అన్నారు కావచ్చు.గౌతమి ఇంకొక పేరు. ఇవన్నీ సంస్కృతపు పేర్లే.ఆంధ్రలు ఇక్కడకు వచ్చిన తర్వాత పెట్టబడిన పేర్లేయివి.

                 తాము కాందిశీకులుగా వచ్చిన చోటుకు మాతృభూమి మీద మమకారంతో తమతమ పేర్లు పెట్టకోవటం అబ్బురమేమీ కాదు. 

కంచి నుండి వచ్చి కృష్ణాజిల్లాలోని మునేరు ఒడ్డున వూరు గట్టుకొని దాని పేరు పినకంచి అని పేరు పెట్టుకుంటే అదే పెనుగంచిప్రోలు అయింది. కడప నుండి బ్రతుకు దెరువుకొరకు కొత్తగూడెం కాలరీస్ కు వచ్చి దాని ప్రక్కన ఊరు గట్టుకొని, పినగడప అని పేరుపెట్టుకుంటే  అది నేడు పెనుగడప అయింది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం బొగ్గుగనులలో పనిచేయడానికి బర్మా నుండి వచ్చినవారు  తాము నివశించే కాలనీకి బర్మాబజారు అని,ఉత్తరప్రదేశ్ లోని ఘోరక్ పూర్,ధన్ బాద్ ,రుద్రంపూర్ నుండి వచ్చిన వారు తమ కాలనీలకు,తాము వదలివచ్చిన,తమతమ పట్టణాల పేర్లు పెట్టుకున్నారు.ఇలా ఎన్నైనా ఉదాహరణలజూపవచ్చు.

            ఆంధ్రుల కాలంలో గంగ అని తర్వాతి కాలంలో గోదావరి,గౌతమి అని పేర్లు కలిగి,తెలివాక క్రమక్రమంగా కనుమరుగైపోయింది.

   మన అసలు సిసలు దేశీయమైన పేరు తెలివాహ ఇక్కడ అంతర్ధానమై, మనకు ఉత్తరాన ఉన్న చత్తీస్ గడ్ లో పుట్టి మహానది కుపనదిగా కలిసిన దానికి  తెలివాక అనే పేరెలా గల్గింది, అనే చిక్కుముడిని విప్పేముందు,వాక,-వాహ్ ఎలా అయిందో తెలిసికోవలసిఉన్నది.

     తెలివాక లోని విభక్తి చేరని పూర్వ పూర్వపు రోజుల్లో తెలివాఅనే పిలుచుకొని ఉంటారు.కారాన్ని దీర్ఘంగా గాని ప్లుతంగా గాని,ఉచ్చరిస్తే వాచివర  హ్కార ధ్వని వస్తుంది.అంతెందుకు వారెవా అంటే సరిపోతుంది.కాని  మనం కొండకచో వారేవాహ్ అనటం కూడా కద్దు.ఇప్పటికీ మన పొరుగువారు , మన మధ్య తెనుగుతోపాటు మధ్య ద్రావిడ కుటుంబానికి చెందినవారైన గోండులు మాట్లాడే గోండ్భాషలో వాహ్అంటే వచ్చు అని అర్థం.(తెలుగుభాషా చరిత్ర ,సివి సుబ్రమణ్యంగారు పేజి 45) మనం తెలివాకు విభక్తిని చేర్చుకుంటే వారు హ్చేర్చుకొని ఉండవచ్చు.ఇద్దరి వారు తెలివాక  అంటే అద్దరివారు తెలివాహ్ అని ఉంటారు.ఈ రెండూ మాండలిక భేదాలే తప్ప వేరుగాదు.ఒకదానికొకటి పర్యాయపదాలే.

          ఇక్కడ ఉండవలసిన తెలివాహ్,ఛత్తీస్ గడ్ ,ఒరిస్సాలో ప్రవహించే నదికెలాఎగబాకిందనే ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టమేమీకాదు.ఆంధ్రులు మన ప్రాంతంపై దండెత్తినపుడు ఇక్కడి స్థానికులు తెలింగోఅనే వీరుని నాయకత్వంలో  వారినెదిరించారనేది శ్రీ టేకుమళ్ల రామచంద్రరావుగారు,ఆర్ .వి.రస్సెల్ గారు గోండులకు సంబంధించి,పరంపరగా వస్తున్న పురాణకథల్లో వారు సేకరించిన ఒక కథలోని సారాంశము.అట్లే ఆర్.వి.రస్సెల్ గారు,మధ్యపరగణాలలో సేకరించిన మరొక కథలో నాయకుడు లింగో, ఈ యోధుని సారధ్యంలో ఆర్యులనెదిరించి వారి నేతి భాండాగారాన్ని కొల్లగొట్టారు.ఇక్కడ తెరాలిపోయి లింగోమాత్రం మిగిలింది.ఇలా పై రెండు కథలలోనూ ,ఇక్కడ స్థానికులు ఆర్యుల నెదిరించడంలో సామ్యమున్నది.

  
టాలెమీ తన గ్రంథంలో గోండాలియా అనే జాతిని పేర్కొన్నాడు. ఈ టాలెమీ క్రీ.శ 150 ప్రాంతం వాడు.అంతకు ముందెప్పటినుండో  ఈ జాతి ఉన్నదనీ, వీరి తెగల్లో తెలింగఅనే  ఒక తెగ ఉన్నదనీ తెలిపినందున వారు కూడా గోండాలియా లంత ప్రాచీనమైన వారనీ సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ గారు తెలిపియున్నారు. (ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర మొదటి భాగం)

     పైన ఉదహరించిన పెద్దల రచనల వలన ఉత్తరదేశము నుండి వచ్చిన ఆర్యులను ఆనాటి మన తెలుగువారి నాయకత్వంలో, మిగిలిన తెగలవారంతా ఏకమై ఎదిరించారనేది స్పష్టం.

        ఆర్యులనెదిరించి,ఓడి ప్రాణభయంతో ఉత్తరరణ్యాలకు  వలసపోయి ఒక నదీతీరాన నెలసి,తాము విధిలేక వదిలివచ్చిన,తమ కత్యంత ప్రీతిపాత్రమైన తెలివాక లేక తెలివాహ పేరును పెట్టుకున్నారని తెల్పిన ఒప్పేకాని తప్పుకాదు గదాఆ దుర్గమారణ్యాలలో నున్న ఆ చిన్న నదిపేరును మార్చవలసిన అవసరం ఎవరికీ కలుగకపోవడం మన అదృష్టం.ఇక్కడి మన తెలివాక శిధిలావశిష్ట రూపంలో అక్కడైనా మిగిలింది. 

  ఆనాటి తెలివాక(తెలివాహ) తెలుగుగా మారింది. శబరీ నదీ ప్రాంతాననున్నప్రజలు శబరులు. వారే ఈనాడు సవరలనీ,వారి భాష సవర అని పిలువబడుతున్నది.

   ఒక నది పరిసరాల్లో నివసించేవారిని,వారి భాషను ఆ నదిపేరిట పిలుస్తారనటానికి సవరలు-సవరభాష ఒక ఉదాహరణ.కనుక తెలివాక నదీప్రాంతవాసులను తెలుగువారనీ, వారు మాటాడేభాషను తెలుగు అన్నారంటే వింతేముంది.

    ఈ తెలుగునకు మరొక వ్యుత్పత్తినిగూడా చూపవచ్చు.మనకు పశ్చిమ నైరుతి దిక్కున  ఉన్న రాష్ట్రం కరి+నాడు=కర్నాడు కన్నడ అయింది.కన్నడ రాష్ట్రం అంతటా ఎక్కువభాగం కరి అంటే నల్లనేల, అట్లే మన గోదారి పరివాహక ప్రాంతమంతా తెల్లనేల. తెలంగాణా, మిగిలిన మన ప్రాంతమంతా ఎడనెడ ఎర్ర,నల్ల భూములున్నా ఎక్కువశాతం తెల్లభూములే.ఇప్పటికీ పాల వాయలు, తెల్లవాగులు, పాలవంకలు పాలేర్లు ఎన్నో ఉన్నాయి.

  • ఒక పాలేరు ఖమ్మం జిల్లా నుండి బయలుదేరి కృష్ణలో కలుస్తుంది.
  • ఇంకొక పాలేరు ప్రకాశం జిల్లాలో ప్రవహిస్తూ నేరుగా సముద్రంలో కలుస్తుంది. 
  • మరోక పాలేరు కుప్పం మీదుగా తమిళనాడు ప్రవేశించి అచట పాలార్ నదిగామారింది. పాల+ఏర్లు = పాలేర్లు. పాలు అంటే తెలుపు. ఏరు అంటే వాగు. తెల్లని ఏర్లనియే కదా అర్ధం తెల్లభూముల గుండా పారేవి కనుక పాలేర్లయ్యాయి.


తెల్లభూమిని తెల్లమాగాణమూ అంటారు అదే తెలంగాణా, తెలంగ-తెలుగు అయ్యిందంటే ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి. కనుక నదీపరంగా చూసినా, నేలపరంగా జూసినా మన నేల తెలుగు నేల మన భాష తెలుగుభాష.

మన ఉత్తరాంధ్ర వాసులు ను గా పలుకుతారు. మనం లేదు అంటే వారు నేదు అంటారు. ఈ మాండలిక భేదం తెలిసిన వాడు పైగా రాజమహేంద్రం వాడు కనుక నన్నయ్య తన భారతంలో తెలుగని, తనుగనీ రెండింటినీ ప్రయోగించాడు. తెలుగు ప్రాచీనము తెనుగు అర్వాచీనమూ అని మనవి.

నా ఆలోచనలను తెలుగు అభిమానుల ముందుంచుతున్నాను. నా మాటే ప్రమాణమనికానీ ప్రమాణం కావాలన్న పేరాశ కానీ నాకు లేదు. పెద్దలు నా అభిప్రాయాన్ని అంగీకరించినా, వ్యతిరేకించినా నాకు ఆనందమే. ఎందుకంటారా? అంగీకరించని వారు, ఆంధ్రులు మన దేశానికి రాకముందు మన గోదావరికున్న దేశీయమైన పేరును తెల్పుతారు. కాదు గోదావరే  దేశీయమైన పేరంటే అందుకు గల కారణాలను జూపుతారు. ఎలాగైనా, నా లక్ష్యం నెరవేరినట్లే. ప్రతి ఆలోచన మరొక ఆలోచనకు ఎడమిస్తూనే వుంటుంది. కనుక పెద్దల సలహాలను సదా తలదాల్చసంసిద్దుడగు,


పండిత విధేయుడు
గంగుల బాబు
విద్యానగర్, సత్తుపల్లి

ఖమ్మంజిల్లా
( వ్యాస రచయిత విశ్రాంత తెలుగు పండితులు )

ఈ వ్యాసానికి ఉపకరించిన వ్యాసాలూ-గ్రంధాలు
  • 1.శ్రీ సంగనభట్ల వారి తెలంగాణా-తెలివాహ వ్యాసం (ఆంధ్రభూమి)
  • 2. శ్రీ యార్లగడ్డ బాల గంగాధరరావుగారి వ్యాసం (ఆంధ్రజ్యోతి)
  • 3. శ్రీ లగడపాటి సంగయ్యగారి వ్యాసం (ఆంధ్రజ్యోతి)
  • 4. విష్ణుకుండినులు (నేలటూరివారు)
  • 5. సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి భాగం (ఆరుద్ర)
  • 6. విష్ణు పురాణం
  • 7.ఆంధ్రభాగవతం (పీఠిక)
  • 8. తెలుగు భాషా చరిత్ర – సి.వి. సుబ్రహ్మణ్యం గారు
  • 9. ఆంద్ర మహాభారతం - నన్నయ్య



                     

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి