బోయలే తొలి తెలుగు చోళరాజులు - భీమనాధుని శ్రీనివాస్‌

తెలుగు మూలాలపై, మూలవాసులెవరు అన్న విషయంపై విశ్లేషణాత్మక వ్యాసాలు రిఫరెన్సుగా చదివేందుకు వీలుగా ఇక్కడ బ్యాక్ అప్ చేస్తున్నాను.

‘తెలింగ’ కుల పదం కూడా! అనే శీర్షికన (నవంబర్‌ 24, వివిధ) ఆర్‌.వి. ఆర్‌. నాయుడు రాసిన వ్యాసంలో ప్రాచీన చోళరాజులు తెలగాలని, కాపులని, బలిజలని చెబుతూ వ్యాసకర్త ఊహల్లో విహరించారు. ‘కాపు’ అనే మాట బలిజలకు అన్వయించారు. అయితే ప్రాచీన తెలుగు చోళులు బోయ-ముత్తురాజులనీ, వీరే తొలి తెలుగు ‘కాపు’లని ఈ వ్యాసంలో పేర్కొనడం జరిగింది.

తమిళ సంఘ సాహిత్యంలో శేషాచల ప్రాంతంలోని చిట్టడవుల్లో వడుగర్లు (తెలుగు ప్రజలు) బోయలు వేటకుక్కల్ని వెంటబెట్టుకొని వేటాడేవారని, కొందరు ఏనుగుల్ని మచ్చిక చొసుకొనే వారని చెప్పబడింది. చిత్తూరు జిల్లా తిరుపతి తూర్పు మండలాలు సత్యవీడు శ్రీకాళహస్తీ స్వర్ణముఖీతీరం వరకు చిట్టడవులు వ్యాపించి ఉంటాయి. నెల్లూరు, కడప మధ్య సరిహద్దులోని వెలిగొండలు తప్పా నెల్లూరు జిల్లా అంతటా చిట్టడవులు వ్యాపించి ఉన్నాయి. ఈ చిట్టడవులే బోయల ఆవాస ప్రాంతాలని తెలుస్తుంది. దూర్జటి మహాకవి శ్రీకాళహస్తి మహత్మ్యంలో ‘పొత్తపినాడు’ తిన్నడి ఆటవిక రాజ్యమని పేర్కొన్నాడు. ఈ బోయ తిన్నడే శ్రీకాళహస్తీశ్వరునికి కన్నిచ్చి కన్నప్ప అయ్యాడు. ఇప్పటి కడప జిల్లా రాజంపేట తాలూకా కేంద్రంగా దక్షిణాన స్వర్ణముఖీ తీరం వరకు, పొత్తపినాడు విస్తరించి ఉండేది. ఈ పొత్తపినాడు నుండే వేట్టువర్‌, లేక వేడర్లను చౌరరాజు పళని ప్రాంతానికి తీసుకెళ్ళి అడవులు నరికించి గ్రామాలు నిర్మించినట్లు ‘కొంగు మండల వరలారు’ అనే పుస్తకంలో చెప్పబడింది. (అంతూ దరీ కానరాని తెన్నాటి తెలుగు మూలాలు - స.వెం.రమెశ్‌- నడుస్తున్న చరిత్ర మాసపత్రిక నవంబర్‌ - 2007) ఈ వివరాలను బట్టి వేట్టువర్‌ లేక వేడర్లు కన్నప్ప సంతతి వారని తెలుస్తుంది. అరణ్యాలలో వేటగాళ్లు మాటువేసి వేటు వేయడంలో ప్రావీణ్యం గలవారు కనుక తమిళంలో వేట్టువర్‌ లేక వేటువర్‌, వేడర్‌లయ్యారు. కన్నడంలో బేడడు లేక బేడర్‌లయ్యారు. తెలుగులో బోయలుగా పిలువబడ్డారు.
ప్రాచీన కాలం నాటి మౌర్య విష్ణుకుండిన, సాలంకాయన, పల్లవ శాసనాలలో గ్రామ అనే పేరున్న సంస్థ ఆ ఊరి వ్యవహారాలు చూస్తూ ఉండేదని అం దులోని సభ్యుల్ని గ్రామేయకులు అనేవారని చెప్పబడింది. ఈ గ్రామ అనే పౌర సంస్థ అధిపతిని సంస్కృతంలో ‘ముత్తుద’ లేక ‘ముతుద’ అంటారు. ‘ముతుద’ అంటే తెలుగులో ఊరి కాపు, గ్రామరక్షకుడు అని అర్థం ఉంది. సాలంకాయన పత్రాలన్నీ విధిగా ‘ముతుద’ను సంబోధించి రాసినవే. ఈ గ్రామ సంస్థ హోదా తరతరాలుగా వస్తూ ఉండేది కనుక ఈ విధానాన్ని చక్రవర్తులు గౌరవించేవారు. ఈ గ్రామాధిపతి ‘ముతుద’ను గ్రామబొజక, వేట్టువ, గామేయన్‌ వంటి పేర్లతో పిలువబడినట్లు కొన్ని శాసనాలలో ఉంది. రాజుగారి భూముల్ని సాగు చేసే బాధ్యత కూడా వీరిదే. గ్రామంలోని భూస్వాముల నుంచి బలవంతంగా చాకిరీ చేయించుకొనేవారు. ఈ అధికారుల్ని బోయలు లేక బోయన్‌లు అనేవారు. (ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర సంస్కృతి 11.ఐ.కె. శర్మ) ఈ ఆధారాలను బట్టి బోయలు సంచార జీవనం నుంచి స్థిర నివాసాలు నిర్మించుకొనే క్రమంలో అడవులను నరికి గ్రామాలను ఏర్పాటు చేసి గ్రామరక్షణ వృత్తిని స్వీకరించి ఆయుధం పట్టిన తొలి కాపు కులస్థులని సుస్పష్టమౌతుంది. ఈ బోయలే చోళ్లు అంటే రాగులు (తైదలు) పండించుటలో ప్రసిద్ధులైనందున చోళ్లులు లేక చోళులు అని వ్యవహరించబడ్డారు. ఈ చోళ వంశీయులు ఆంధ్ర దేశంలోని రాయలసీమ ప్రాంతాలైన కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాలను పాలించి ఏడువేల నాడు రేనాడు అని తమ శాసనాలలో చెప్పుకొనుట వలన వారి ని రేనాటి చోళులని చరిత్రకారులు వ్యవహరించారు.
రేనాడు చోళ వంశీయులు తాము ఎరికల్‌ లేక ఎరిగల్‌ చోళ ముత్తు రాజులమని వారి శాసనాలను ప్రకటించుకొన్నారు. ఈ వంశంలోని ఎరికల్‌ చోళముత్తు రాజు ధనుంజయుడు రేనాడును పాలిస్తూ కడప జిల్లా కమలాపురం తాలూకా కలమళ్ల గ్రామంలోని చెన్నకేశవ దేవాలయంలో క్రీ.శ. 575లో తొలిసారి తెలుగు భాషలో శాసనం వేయించాడు. ఇప్పటి వరకు లభించిన శాసనాలలో ఈ శాస నం తొలి తెలుగు శాసనంగా గుర్తించబడింది. ఈ చోళరాజులకు సంబంధించిన 4 తామ్ర శాసనాల 51 దాన శాసనాలు లభించాయి. దాన శాసనాలలోని కొన్ని అక్షరాలు చెరిగిపోవడం చేత ప్రాచీన తెలుగు పదాలు అర్థం కాకపోవడం వలన 33 దాన శాసనాలు మాత్రమే పరిష్కరించి ఎఫిగ్రాఫియా ఇండికా (సంపుటి 27)లో కె.ఎ. నీలకంఠ శాస్ర్తి గారు, ఎం. వెంకట్రామయ్య గారు ప్రకటించారు. (రేనాటి చోళులు - కె. శ్రీనివాసులు)
‘ఎరికల్‌’ అంటే నిప్పురాయి అని అర్థం. పాతరోజుల్లో మెరుపులు వచ్చినపుడు ఆకాశం నుంచి నిప్పురాయి పడుతుందనే భావన ఉండేది. నేటికీ చోళమండలంలో పిడుగుకి ఎరికల్‌ అంటారు. ఈ చోళులలోని మరొక శాఖ తమిళనాడులోని తంజావూరు, కొడంబలూరు తిరుచానారు ప్రాంతాలను పరిపాలించి చోళముత్తురాయర్లమని ప్రకటించుకొన్నారు. పెరుంబిడుగు, మార్పిడుగు, విడెల్‌ విడుగు వంటి తెలుగు బిరుదులు ధరించి తెలుగు తనాన్ని చాటుకొన్నారు. ప్రాచీన తెలుగు చోళ బోయ, ముత్తు రాజులు రేనాడు, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, వెలనాటి, ఎరువ వంటి ప్రాంతాలను పాలించి ఆ ప్రాంత నామాలతో వ్యవహరించబడ్డారు. ఈ ఆధారాలను బట్టి ప్రాచీన తెలుగు చోళులు ఎవరో వారి కులం ఏమిటో తెలుస్తుంది. బోయ, వాల్మీకి ముత్తురాజు, పాళెగార్‌, తలారి ముదిరాజు వంటి పేర్లతో పిలువబడుతూ, తెలంగాణ ప్రాంతంలో ద్రావిడ ‘న’కారాన్ని జాతి పేరులో నిలుపుకొని తెనుగోళ్లమని (ముదిరాజు)లు చెప్పుకోవడాన్ని బట్టి వారు ఎంతటి తెలుగు మూలవాసులో అర్థమౌతుంది.
- భీమనాధుని శ్రీనివాస్‌
8297594166


కామెంట్‌లు