సాంత్వన

తుఫాను రాబోతున్నవేళ
ఒంటరి గూటిలో విషణ్ణతే చేరకుండా
బిడ్డలుగా మారాల్సిన గుడ్లపై రక్షణగా కూర్చుని
యుద్ధాన్ని ఎదిరించే సైనికుడిలా నిలబడిందో పక్షి.


రంగుకాగితాల సుడిగాలిలోనో
నిరంతర పరుగుపందేల వడిలోనో
బందాలన్నీ కొట్టుకుపోతుంటే
అందరినీ వదిలేసిన ఏకాంతాన్ని పీల్చుకోకుండా
అందరూ వదిలేసిన ఒంటరితనంలో అల్లాడిపోతున్నాడో మనిషి.

అందరూ కాదంటే కూలబడిన సన్నాసిని చూసి
అందర్నీ కాదని వచ్చిన ఓ సన్యాసి నవ్వుకుంటున్నాడు.
గుంపులో నిశ్శబ్దాన్నీ, ఏకాంతంలో సంభాషణల్నీ ఆస్వాదించాలంటే
లోపటి పరికరం మరింత సరిగా పనిచేస్తుండాలి.

తుఫాను వచ్చినా రాకున్నా
తల్లిపిట్ట తన భాద్యత మర్చిపోలేదు.
భాద్యతను మించిన ఆ కర్తవ్యానికి
 నిఘంటువుల్లోనే మరోమాట చేర్చాలి.

అంతాచేసి
చి
...వ
.......ర్లో
పర్సుతీస్తే
...కొన్ని కార్డులూ,
......కొన్ని కాగితాలూ,
అస్సలు జీవితమంటూ అక్కడేమీ లేనేలేదు.
ఈ నిశ్శబ్దంలో మౌనం  పొసగదు.
కాలపు నడకలో చలనం లేనందుకు.






కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి