బతుకమ్మ అసలు పేరు బృహదమ్మ అనిచెప్పే కథమీకు తెలుసా?

తెలంగాణా బతుకమ్మపండుగ అధికారిక లోగో
బతుకమ్మ పండుగను 2014 అక్టోబరు 2వ తేదీనుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఇప్పుడు ఇది చాలా పెద్దపండుగ. మరి అసలు బతుకమ్మ పండుగ మూలాలేమిటి? బతుకమ్మ అంటే ఏమిటి? ఎప్పటినుంచి ప్రారంభం అయ్యింది? అనే దానిపై ఇదిమిద్దంగా ఖచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. కానీ వేర్వేరు కథనాలు మాత్రం వాడుకలో వున్నాయి. తగిన ఆదారాలు దొరకనప్పుడే హైపోధీసీస్ లను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం వుంది.

పూలు కాయల పూజ పండుగ

తొలిగా కాసిన కాయలను, తొలిపూతను దైవానికి అర్పించడం, వాటిని ప్రత్యేకంగా పూజించడం అనే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా వుంది. ఇక పూల అలంకరణలను సౌందర్యాత్మకంగా ఆరాదించడంతో పాటు పవిత్రంగా పూజించడం అనే పద్దతికూడా వాడుకలో వుంది. సంక్రాంతి పండుగకు ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలతో పాటు పూల అలంకరణ వున్నట్లుగానే అచ్చంగా పూలనే శివలింగాకారంలో కొప్పుగా పేర్చి చేసే ఈ బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకమైనదని తెలియజేస్తూ చెప్పుకునే అత్యంత పురాతనమైన కథనం ఒకటుంది.

బతుకమ్మ అంటే బృహదమ్మ అట తెలుసా?


బృహత్ అంటే గొప్ప అని అర్ధం బృహత్ అమ్మ లేదా బృహదమ్మ అంటే గొప్ప అమ్మ అని అర్ధం. శివుని భార్య గౌరీదేవి బృహదమ్మ అయినప్పుడు శివుడు బృహదీశ్వరుడుగా వున్నది ఎక్కడో తెలుసా? అవును తంజావూరులోని శివుడు బృహదీశ్వరుడు అని పిలువబడుతున్నాడు. ఆ ఆలయాన్ని కూడా బృహదీశ్వరాలయం అంటారు అని తెలుసుకదా. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చినది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టారు. అయితే అక్కడెక్కడో తమిళనాడులో యునెస్కో వారి వారసత్వ సంపదగా గుర్తించబడ్డ తంజావూరు దేవాలయానికీ తెలంగాణాలోని బతుకమ్మకు సంభందం ఏమిటి?

తెలంగాణలోని వేములవాడలో రాజేశ్వరాలయం వుంది. రెండవ అరికేసరి (క్రీ.శ 930-955) వేయించిన దానశాసనంలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. అంటే అప్పటికే రాజేశ్వరాలయం చాలా ప్రసిద్దమైనది. ఈ వేములవాడ ప్రాంతాన్ని 973 ప్రాంతంలో రాష్ట్రకూటుల సామంతరాజయిన రెండవ తైలపదేవుడు(తైలపుడు) చివరి రాష్ట్రకూటరాజైన రెండవ కర్కుడిని ఓడించి తన స్వతంత్ర కళ్యాణీ చాళుక్యరాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్న కాలం అది. అయినా సరే ఈ వేముల వాడ చాళుక్య రాజులు రాష్ట్రకూటులకు సామంతులుగానే వున్నారు. ఆ సమయంలోనే చోళులతో రాష్ట్రకూటులకు యుద్దం వస్తే వేములవాడను పాలిస్తున్న కళ్యాణి చాళుక్యులు కూడా రాష్ట్రకూటుల పక్షం వహించాల్సి వచ్చింది. ఈ విధంగానే రెండో పరాంతకుడు వేములవాడ లోని రాజేశ్వరాలయాన్ని సందర్శించినట్లు శాసనాలలో పేర్కొన్నారు.
తంజావూరులోని బృహదీశ్వరాలయం


చోళులకు రాష్ట్రకూటులకూ మధ్య జరిగిన యుద్ధంలో చోళులదే పైచేయి అయ్యింది. వేముల వాడ ఆ విధంగా రాజేంద్రచోళును ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దేవాలయాన్న ధ్వంసం చేసినప్పటికీ దేవాలయ మూలవిరాట్టయిన రాజేశ్వరుడు (బృహదీశ్వరుడు) మహత్మ్యాన్ని తెలుసుకున్న రాజేంద్రచోళుడు ఈ బృహదీశ్వరలింగాన్ని తన విజయానికి గుర్తుగా ఇక్కడినుంచి తరలించి తన తండ్రి రాజరాజచోళునికి బహుమతిగా సమర్పించుకున్నాడట. 1006 లో ఈ లింగానికి(బృహదీశ్వరునికి) దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. నాలుగేళ్ల నిర్మాణపు పనుల అనంతరం 1010 లో లింగప్రతిష్టాపన జరిపి గోపుర కలశాభిషాకాలు నిర్వహించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు ఈ బృహదీశ్వరాలయాన్ని వేములవాడ చాళుక్యదేశంపై జరిపిన దండయాత్రలో సాధించిన ధనంతో నిర్మించినట్లు అక్కడి శాసనాలలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు నిర్ధారణ చేసుకోవాలన్నా సరే వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం, బృహదీశ్వరాలయంలోని శివలింగం ఒకేలా వుండటాన్ని గమనించగలం.

తంజావూరులో గొప్పదేవాలయాన్ని కట్టుకుని దోచుకెళ్ళిన గొప్ప శివలింగాన్ని ప్రతిష్టించుకుని చోళులు సంతోషపడుతుంటే ఇక్కడ వేములవాడలో చాళుక్యుల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తామింత కాలం తమను కాచే దైవంగా కొలుచుకుంటున్న దేవుడిని తరలించుకు వెళ్ళారు. అయ్యలేని ఇల్లులా దేవుడు లేని శిధిలదేవాలయం వీరి బాధను రెట్టింపు చేస్తూనే వుంది. యుద్దంలో ఓడిపోయి దాడికి వెళ్ళేంత సైన్యం,ధనంలేక మౌనంగా తమబాధను దిగమింగుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. తామే ఇంత దు:ఖంలో వుంటే గౌరీదేవి ఎంత బాధలో వుంది కదా అనుకున్నారో, లేదా ఎప్పటికైనా ఆ శివలింగాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సిందేనంటే ఈ సంఘటనను తమ వారసులే కాదుప్రజలెవ్వరూ మర్చిపోకూడదనుకున్నారో కానీ అక్కడి శివలింగాన్ని బృహదీశ్వరుడన్నందుకైనా అతని భార్య మాదగ్గరే వున్న దన్నట్లు ఇక్కడ గౌరీదేవిని బృహదమ్మ అనిపిలవడం ప్రారంభించారు. పూలను అందంగా శివలింగాకారంగా కుదిరినంత పెద్దగా ఎత్తుగా పేర్చి ఆ శివలింగాకారంపై పసుపుముద్దతో చేసిన గౌరీదేవిని వుంచుటాన్ని ఇప్పటికీ ఆచారంగా మనం గమనించగలం. అలా తయారు చేసుకున్న బృహదమ్మను రోజూ అందరూ కలిసి పాటలు పాడుకుంటూ పూజించి చివరి రోజు బృహదీశ్వరుడినే ఇక చేరుకోవమ్మా అన్నట్లు నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా పాడే పాటలలో చోళరాజుల ప్రసక్తి వుండటాన్ని మనం గమనించవచ్చు. చోళదేశ రాజైన ధర్మాంగదుడు నూరునోములు నోచుకున్న తర్వాత నూరుమందిని పొందాడట. ఆ పాటలో మొదటి భాగం ఇలాగ వుంటుంది.

శ్రీ లక్ష్మిదేవియు ఉయ్యాలో – సృష్టిబతుకమ్మయే ఉయ్యాలో

పుట్టినారీతి జెప్పే ఉయ్యాలో – భట్టు నరసింహకవి ఉయ్యాలో
ధరఛోళదేశము ఉయ్యాలో – అది సత్యవతియండ్రు ఉయ్యాలో
నూరునోములు నోచియు ఉయ్యాలో – వైరులచే మృతులైరి ఉయ్యాలో

ఈ పాటను బట్టి పరిశీలిస్తే వేములవాడ బృహదీశ్వరుడిని తరలించింది. ఛోళరాజు, బహుశా రాజరాజచోళుడి తండి రెండో పరాంతక చోళుడు రాజేశ్వర నోము నోచి దేవుడి అనుగ్రహంతో పొందిన కుమారుడికి దేవుడి పేరుమీద ‘రాజరాజ’ అని పేరుపెట్టి వుంటాడేమో. 
బతుకమ్మ తయారీలో పూలపేర్పిడి విధానం
అలాగే శివుడు దూరమైన గౌరీదేవిని ఓదర్చులూ పాడే పాటలనూ గమనించవచ్చు
ఊదాహరణకు...

ఒక్కేసి పువ్వేసి చందమామ..
ఒక్క జములయ్యే చందమామ..
శివుడు వచ్చే వేలాయే చందమామ..
శివుడు రాకపోయే చందమామ...

అనే ఈ అమ్మవారి ఊరడింపు పాటను బతుకమ్మనిమజ్జనం చేసే ముందు పాడుతుంటారు.

దొంగలెవరో దోచుకున్నారంటూ పాడే మరోపాటు కూడా ఇలా వుంటుంది.
దొంగలెవరో దోచిరి  గౌరమ్మ - బంగారు గుండ్లపేరు గౌరమ్మ
దొంగతో దొరలందరూ గౌరమ్మ - బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
రెండేసి పూలేసి రాశిపడబోసి గౌరమ్మ - బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
మూడేసి పూలేసి రాశిపడబోసి గౌరమ్మ - బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పాలన్నట్లు నాలుగు,ఐదు,ఆరు, ఏడేసి పూలేసి అన్నలైన్లలో కూడా దొంగతో దొరలు కూడా కలిసి బండ్లలో బయలల్లారనీ ఆ రకంగా ముఖ్యమైనదేదే అధికారికంగానే తరలించారనే అర్ధాన్ని ఈ పాట కూడా మనకు అందజేస్తుంది.

బృహదమ్మలోని బృహత్ పేరు వినియోగం పై మరికొన్ని ఉదాహరణలు

ఈ బృహత్ పేరును వాడుతూ రాసిన గ్రంధం ‘బృహత్ కథ’ అనే సంస్కృత గ్రంధాన్ని రాసిన గుణాఢ్యుడు కూడా తెలంగాణలోని మెదక్ జిల్లావాడే కావడం ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ ప్రాచీన గాధ అనేక కథలు, కావ్యాలు, నాటకాలకు మూలమైనదిగా కూడా ఉపయోగపడింది. బృహత్ కథ ‘పిరంగదై’ పేరుతో తమిళంలోకి కూడా అనువదించబడింది. అలాగే ప్రాచీన ఉపనిషత్తుల్లో ఒకటైన బృహదారణ్యకోపనిషత్ లోకూడా బృహత్ వినియోగం కనిపిస్తుంది. ఇలా బృహదమ్మయే బతుకమ్మగా ఈనాడు పూజలందుకోవడం కేవలం భక్తిమాత్రమే కాదు ఒక సంకల్పాన్ని ఉద్యమంగా రూపొందించడంలో భాగం అనే విషయం నిజంగా ఆశ్చర్యం అనిపించకమానదు.
మరి వెయ్యేళ్ళ ముందునుంచే బృహదమ్మ ను పూల శివలింగంగా పూజించడం ప్రారంభం అయివుంటే తెలంగాణాప్రాంతాన్ని అనేక ఏళ్ళు పరిపాలించిన కాకతీయుల కాలంలో ఆ ప్రస్తావన వుండేది కాదా? అనేక శాసనాలను వేయించిన కాకతీయులు ఈ పండుగగురించి ఒక్కచోటనయినా ప్రస్తావించేవారు కాదా? అనే సందేహం రావడం సహజం. రాణి రుద్రమదేవి కాలంలో బతుకమ్మ పండుగ జరిపినట్లు కొంతవరకూ ఆధారాలు దొరికాయనే చెప్పాలి. ఈ అమ్మ కాకతమ్మయేనా లేకా బృహదమ్మ లేక బతుకమ్మ అయివుంటుందా అనేది మరింత బాగా తెలియాలంటే లభిస్తున్న ఆధారలను మరింత నిశితంగా పరిశీలించాల్సివుంటుంది.

కల్లోలము లణగెను. శాంతి యేర్పడెను. విజేతలగు సాహిణఉలు నగరము చేరిరి. ఇంతలో శరన్నవరాత్రములు సమీపించేను. బతుకమ్మ(కాకతమ్మ?) పండుగ లీతఱి సమధికోత్సాహముతో జరుప మహారాజ్ఞి(రుద్రమదేవి) యానతిచ్చెను. నగరమంతయు నలంకరింపబడెను. వీధులు రత్నతోరణాబద్దములైనవి. ఇంటింట నుత్సాహము తాండవించుచుండెను. మంగళ తూర్యధన్వనులతో దిక్కులు ముఖరితము కాసాగెను. కోటబురుజులపై విజయకేతనము లెగిరెను. పుసీమంతినులు సాలంకృతలై వివిధ పుష్పతతులతో నపూర్వనైపుణితో ప్రభలు కట్టి పురవీధులలో నూరేగిరి ప్రజలలో నపూర్వకళాకౌశలము వెల్లివిఱియుచుండెను.

బతుకమ్మ పండుగ వేడుకలు జూచుటకు ఇరుగుపొరుగు నగరములవారు ఓరుగంటికి చీమలబారుగ వచ్చుచుండిరి. వారు తూరుపు తెలతెల వారంగనే లేచి స్నాతులై యోరుగంటికి బయనమై వెళిపాళెమున బ్రవేశించిరి. అచ్చటినుండి మేదరవాడ మీదుగ యగడ్తదాటి, నగరములోనికి బోవు హట్టమార్గమున (పెద్దమార్గము) మైలసంత గడచి యచట జరుగు జూదపు వినోదములను జూచుటకు గొంతతడవాగు చుండిరి. అట గనుమయవ్వాలి దేశంబు కరణకాంతలును, తెలికు జోటులను అమ్ముసంపెంగనూనె మన్నగు వాసన నూనెలను గొనుచు ముందుకు జనిరి. కొంతముందుకు జనగా మోహరివాడ కననయ్యెను. అక్కడ వీరభటసమూహముల జూసి యాశ్చర్యపడుచు నడచిరి. ఇప్పటికి వెలికోట వీధులగడచిరి. ఓరుగల్లు రాతికోట యాకాశమునందుకొన నుంకించుచు. వారికి దిగ్ర్భాంతి కలిగించుచుండెను. వారు జనసంకులమగు వంకదారబ్రవేశించి బంగారు తలపులు గల గవనులలో జొచ్చిరి. రాజమార్గమేనుగులు, గుఱ్ఱాలు, బండ్లు భటులు మొదలగు వానిచే సంకులమై ధూళిరేగుచు కష్టముమీద బోవదగినదిగా నుండును. కావున కొందఱు కలకలము లేని క్రంత త్రోవలబోవుచు వినోదముల జూచుచుండిరి.




పై వివరణలో తెలియజేస్తున్న పండుగను గమనిస్తే పూలపేర్పు దగ్గరనుంచి వాటి పూజ, ఊరేగింపు విధానాలు బతుకమ్మపండుగ జరిగేశైలికి దగ్గరగా వుండటాన్ని గమనించవచ్చు. అంటే బతుకమ్మ స్పూర్తి ఈనాటిది కాదు వేలయేండ్ల నాటినుంచే జాతినరనరాల్లో కలిసిపోయివుందని అర్ధం చేసుకోవచ్చు. కానీ అనేక కారణాల వల్ల కొంత మరపునపడటం, మరికొంత మరుగున పడటం మూలాను మరింత ఇబ్బంది కరమైన అంశం అసందర్భ వివరణలు చొచ్చుకురావడంతో అసలు అర్ధం మరుగున పడిపోయివుంటుంది. ఈ ప్రాంతపు ప్రత్యేక పండుగగా గుర్తింప బడుతూ రాష్ట్రప్రభుత్వ అధికారిక పండుగయిన బతుకమ్మను గురించి మరింత నిర్ధిష్టమైన పరిశోధనలు చేసి సరైన వివరాలను వెలుగులోకి తీసుకురావలసిన అవసరం వుంది.

ఇదే అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వుంటే మీకు ఈ క్రింది ఆర్టికల్ ఉపయోగపడవచ్చు
1) బతుకమ్మను తెలంగాణాలో మాత్రమే జరుపుకోవడం వెనుక కారణం ఏమై వుంటుంది?
2) ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పూలపండుగలేమైనా వున్నాయా?

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి