అలారం మోగుతోంది

అగ్నిపర్వతంలా కుతకుతలాడుతూ
లావాలా ఎగిసిపడుతూ లోనాబైటా కాల్చే ఈ అసహనమెక్కడిది?
నదులన్నీ ఇంకిపోయాయి
నదీమూలంలాంటి ఏ చోటునుంచి ఈ విషం విషయంలా పుట్టి.
కన్నీటికాల్వలకు సాళ్లు తీస్తూ ప్రవహిస్తోంది.



పోకేమాన్లకోసం పాట్లుపడుతూ
క్రైంసిటీ ఆటలతో కాల్చుతూ, కూల్చుతూ పరుగులెట్టే అరచేతి ఆటలను
జేబులోపటేకాదు గుండెదాకా ఇంకించుకుంటున్న బాల్యానికి
రక్తం చల్లగా వుండటం అచ్చంగా మానేసినట్లుంది.



ఎరుపే కాదు నీలం సైతం బాల్యపు గూటిని ముంచేస్తోంది
మసకమేఘాలు కమ్మి కారునలుపుని పులిమేస్తోంది.
మత్తుపొరలెన్నో రేపటివెలుతురును చిత్తడిలోకే నెట్టేస్తున్నాయి.
ఇడియట్లు, పోకిరీలు, స్కౌండ్రల్లు నేటి హీరోలయిన రోజుల్లో
మొసపటోనియా మదపుటేనుగులే యాంకరింగులో హూంకరిస్తున్న కాలంలో
బుర్రబూజుపడుతోందని బాదపడేందుకు గదిబయట మనిషెవరూ మిగిలుండటం లేదు.
కుళ్ళు రంగుల లోకమొకటి కళ్ళగుండా మెదడులోకి చీకటిలా పరచుకుంటుంటే
వెలుతురు దివిటీతో దారిని చూపేందుకు చేయోక్కటీ సాయంగా బ్రతికేలేదు.



పలకమోయలేని బుడ్డోడిని వంటిని సైతం
పళ్లు పటపటలాండించే కోపం అలమటపెడుతోంది.
బూతులుగా మాటలు గాల్లోకెగిరితే కానీ
గుండెగూటి బరువేమాత్రం తగ్గనిరోగం సతమతమై సతాయిస్తోంది.
అమిగ్డాలా ప్రపంచంలో ధలామస్ లు తలాడించడం మానేసాయి.
క్రౌర్యం శౌర్యంగా చూస్తున్న కాలంలో శూలం లోతుల్లోకి దిగుతూనే వుంది.



దేశంమీద తుపాకులూ, దేహంమీద చవాకులూ
మతాలూ, కులాలూ, అధికారాలే కాదు ఆఖరుకు ప్రేమకూడా ఉన్మాదంగా మారాక.
పెళ్ళే పవిత్రయద్దమని భావించాక
మంచనేది కేవలంగా నినాదంగానే శుష్కించాక.

మొన్న కాలేజీకుర్రాడిని గుండెల్లో గుద్దిగుద్ది ఘూర్జరించింది.
నిన్ననే పసిగుడ్డుని కాలితో తన్నితన్ని నలిపేసింది.
రేపు కడుపులో పిండానికి కసాయితనం నూరిపోస్తోంది.
వాడేవడో మనిషేనని భావిస్తారేమో కానీ
అది ఒక వైరస్ ఇన్ఫెక్టెడ్ ప్రొగ్రాం, ఒక డిసీజ్డ్ డిజార్డర్
హలో.. అత్యవసర పరిస్థితి ప్రకటించండి
అయ్యో.. ఇకనైనా మునిగిపోతున్న నావను ఒడ్డుకు లాగండి
అరరే .. ఆరిపోతున్న రేపటిదీపానికి చేతులద్ది కాపాడండి.
మీరే !!... అలసిపోతున్న కర్తవ్యానికి వెన్నుచేర్చినిలబడండి.
బోర్డర్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్.. కంటిచూపునైనా సారించండి.

ఆఖరిశ్వాస ఆగేలోగా ..........
................
..........
..

మీరింకా చదువుతూనే వుంటే
కనీసం స్పందించండి..... __/||\__
తప్పులని నిందించండి
చేసాయం అందించండి.

కామెంట్‌లు