తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన నేరం ఏమిటి?

రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన నేరం ఏమిటి? 

చనిపోయానని తనకు తానే ఎందుకు ప్రకటించుకున్నాడు?
మరోధుభగన్ నవలలో బూతు సాహిత్యం వుందా? 
One part woman అగ్లీ నవలనా?
మద్రాసు హైకోర్టు రచయతకు ఎలా ఊరట కల్పించింది?

తెలుగు నేలే నయం తాపీ ధర్మారావుగారు రవికెల పండుగ గురించి రాసినా, దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు అంటూ వివరించినా తాతాజీ అంటూ తలకెత్తుకుందే కానీ తలతిక్క తైతక్కలేమీ ఆడలేదు. కానీ తమిళనాడులో ఈ మధ్య రవికెల పండుగలాంటి ఒకానొక ఆచారాన్ని ఆధారంగా చేసుకుని తమిళపంతులు గారు ఒకాయన అప్పుడెప్పుడో 2010లో మరోధుభగన్ పేరుతో తమిళంలో రాసినప్పుడు లేని గొడవ 2013లో పెంగ్వన్ సంస్థవాళ్ళు one part woman పేరుతో అనిరుధ్ వాసుదేవన్ అనువాదాన్ని విడుదల చేసిన తర్వాత అతిపెద్దవివాదంగా చిలికి చిలికి కల్లోలం అయ్యింది. చివరకు విసిగిపోయిన నవలా రచయిత ‘‘‘రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ చనిపోయాడు. అతడు దేవుడు కానందున మళ్ళీ తనంత తాను పునరుత్థానం చెందలేడు. అతనికి పునర్జన్మపై నమ్మకం కూడా లేదు. ఇప్పటి నుంచి పెరుమాళ్‌ మురుగున్‌ కేవలం ఉపాధ్యాయుడుగానే మిగులుతాడు’ అని తానే ప్రకటించుకోవలసి వచ్చింది. ’’

పెరుమాళ్ మురుగన్ ఫేస్ బుక్ పేజీ ఇది

తెలుగు వికీ పిడియాలో మురుగన్ గురించి కొంత సమాచారం ఇక్కడ చూడొచ్చు

కానీ మొన్న జూలై 5వ తేదీన మద్రాసు హైకోర్టు 160 పేజీల చారిత్రాత్మకమైన తీర్పుతో బావ ప్రకటనా స్వేఛ్చకు కనీసపు పూరటనిచ్చింది. ఆ తీర్పు పూర్తి పాఠం కావాలంటే ఈ  లింకులో చూడవచ్చు.


తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్‌, తిరువూర్‌, సేలం, కరూర్‌ ప్రాంతాన్ని ‘కొంగునాడు’ అంటారు. ఆ ప్రాంతంలోని నమక్కల్‌ జిల్లాలో గల తిరుచెంగోడు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో తమిళ భాషా ఆచార్యునిగా గత 18 ఏళ్ళ నుంచి పెరుమాళ్‌ మురుగన్‌ పనిచేస్తున్నారు. ఆయన ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగారు. తిరుచెంగోడ్‌ కొండపైన అర్ధనారీశ్వరుడు విగ్రహంతో ఉండే ప్రాచీన శివాలయం ఉంది. ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాల ముగింపు రోజున రథోత్సవం జరుగుతుంది. సుమారు వంద ఏళ్ళ క్రితం కొన్ని కులాలలో అక్కడొక ఆచారం ఉండేది. సంతానం కలుగని ఆడవారు రథోత్సవం రోజు రాత్రి, వేరే పురుషుడితో కలిసుండొచ్చు. తద్వారా కొందరు సంతానవంతులయ్యేవారట కూడా! ఈ ఇతివృత్తంతో పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన ‘మాధోరు బాగన్‌’ నవల 2014లో ఇంగ్లీషులోకి ’one part woman’ (అర్ధ నారీశ్వరి) పేరుతో అనువాదమైన తర్వాత వివాదాస్పదం తలెత్తింది. 49 ఏళ్ళ మురుగన్‌ ఇప్పటికి ఆరు నవలలు, 4 కథా సంపుటాలు మరో నాలుగు కవితా సంపుటాలు రచించారు. . సీజన్స్ ఆఫ్ ది పామ్‌ నవల 2005లో ప్రతిష్టాత్మకమైన కిరియామా అవార్డుకు ఎంపికయ్యింది. తాను రచించిన కథలకు తమిళనాడు ప్రభుత్వం నుండి కూడా అవార్డులు అందుకున్నాడు తిరుచెంగోడ్‌ ప్రాంతపు గౌండర్‌ అనే వ్యవసాయ కులంలో జన్మించిన ఈ రచయిత, రెండు నవలలు ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైనాయి. ‘కొంగునాడు’ ప్రాంత ప్రజల పలుకుబడులను (పదకోశాన్ని) నిఘంటువుగా అతను తయారు చేశాడు. మాధోరు బాగన్‌ నవలలో ఒక ముఖ్య పాత్ర (పొన్న), పైన పేర్కొన్న విధంగా సంతానవతి కావాలవద్దా అనే వంద ఏళ్ళ క్రితపు కుటుంబ సంఘర్షణను గొప్ప సామాజిక వాస్తవితకతో పెరుమాళ్‌ చిత్రీకరించటంతో అతను తమ స్ర్తీలను, దేవుడిని, పట్టణాన్ని అవమానపరిచాడంటూ కుల, మత, ధన ఉన్మాదులు ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆ నవల కాపీలను తగులబెట్టడం, బంద్‌లు నిర్వమించటం, ఫోనులలో అసభ్యకరంగా తిట్టటం, బెదిరింపులకూ పాల్పడ్డారు. మురుగన్‌ తన నివాసాన్ని కూడా అక్క నుంచి మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ‘మాధోరు బాగన్‌’ నవల 2010లోనే రాసి ఉన్నా, 2014లో దాన్ని పెంగ్విన్‌ సంస్థ ఇంగ్లీషులో ముద్రించిన తర్వాతనే వివాదం మొదలయింది. మురుగన్‌ ఒక సృజనాత్మక రచయితగా, ఉపాధ్యాయునిగా నేటి విద్యా విధానం మీద, కోళ్ళఫారాల్లాంటి, భట్టీయంతో, మార్కులే కొలబద్దగా నడిపే, విపరీత ఫీజుల రెసిడెన్షియల్‌ కళాశాల చదువుల మీద విమర్శనాత్మక వ్యాసాలు రాస్తుండేవారు. ‘హిందూ మున్నాని’ అనే ఆరెస్సెస్‌ సంస్థ ఈ నవల వల్ల శివాలయానికి అవమానం జరిగిందంటూ, కులవాదులను విద్యావ్యాపారులను కూడా రెచ్చగొట్టి రంగంలోకి దింపి చివరికి పెరుమాళ్‌ మురుగన్‌తో పై ప్రకటన చేసేలా ఒత్తిడిని సృష్టించారు. అందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా శాంతి భద్రతల పేరుతో పెరుమాళ్ మురుగన్ తో బహిరంగ క్షమాపణ చెప్పించేందుకు పూనుకున్నారు.

తిరుచెంగోడులోని ఆరెస్సెస్ శాఖ, హిందూ మున్నాని, కొన్ని కులసంఘాలు గత నెలలో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బంద్‌లు, హర్తాళ్లు నిర్వహించాయి. దానితో నవలలో దానిని వ్యతిరేకించే వారికి అభ్యంతర కరమైనవిగా తోచిన భాగాలను తరువాతి ముద్రణ లో తొలగిస్తానని, వారితో చర్చకు తాను సిద్ధమేనని పెరుమాళ్ మురుగన్ ప్రతిపాదించినా ఖాతరు చేయకుండా దాడి చేశారు. ఈ సంఘటనతో మనస్తాపం చెందిన మురుగన్ "రచయితగా పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతడేమీ దేవుడు కాదు. కావున అతని పునరు త్థానం ఏమీ ఉండదు. ఇక నుంచి పెరుమాళ్ మురుగన్ ఒక ఉపాధ్యాయుడుగా మాత్రమే బతికి ఉంటాడు"అని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రకటించాడు. తరువాత రెవెన్యూ అధికారుల చొరవతో మత సంస్థలు, కుల సంఘాలతో సమావేశం జరిగింది. ఇందులో మురుగన్ కూడా పాల్గొన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పడానికి, నవల ఉపసంహరణకు ఆయన హామీ ఇచ్చాడు. ఆయనపై దాఖలుచేసిన కేసుల ఉపసంహరణకు హిందుత్వ సంస్థలు కూడా అంగీకరించాయి.

ఇలాంటి ఆచారాలు పుట్టటానికి ఆధారమైన సమాజాన్నీ, భాష-సాహిత్యాన్నీ, కళలు - విజ్ఞానశాసా్త్రలనూ, మానవ సంబంధాలనూ సంస్కృతినీ వాటి నడుమ ఉండే అన్యోన్య సంబంధంతోపాటు అవి నిరంతర పరిణామశీలంగా ఉంటాయనే దృక్పథ ంతో చూడలేకపోతే గతమూ అర్థం కాదు. వర్తమాన సమాజం నుంచి రూపుదిద్దుకోవాల్సిన భవిష్యత్తూ బోధపడదు. గత కాలపు ఆచార వ్యవహారాలను వాటి పరిమితులనూ నేటి అభివృద్ధి చెందిన సామాజిక అవగాహనతో వాస్తవికంగా తెలుసుకోను యత్నించటం వేరు. వాటికి నేటి సామాజిక ప్రమాణాలను అంటగట్టి చూడటం వేరు. వంద ఏళ్ళ క్రితపు సామాజిక జీవితాన్ని, వారి జీవన సంఘర్షణనూ, అవసరాలనూ వాటి నుంచి పుట్టిన ఆచారాలను వాస్తవికంగా సాహిత్య రూపంలో చిత్రించినందుకు ఒక రచయితపై - ఏకలవ్యుడి బొటనవేలిని నిరికించినట్లుగా - ఆత్మహత్యా ప్రేరితమైన దాడి జరిగింది.

కానీ పెరుమాళ్ మీద పిటీషన్ వేసిన గోవిందరాసు(అరుల్మిగు అర్ధనారీశ్వర గిరివాల), కె. చిన్నుసామి (హిందూ మున్నని సంస్థ) మొదలైన వారు వాదిస్తున్నట్లుగా ఈ విషయం సెక్షన్ 292 కిందకు రాదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. యాంత్రికంగా సెక్షన్లు వల్లించటం, పదజాలాన్ని వాడటం మంచిది కాదనీ, సెక్షన్ 292 లో పేర్కొన్న అశ్లీలత ఈ కధలో లేదని చెప్పటం సరైన నిర్ధారణ. నవలలోని చిన్న చిన్న ముక్కలను తీసుకొని తప్పు పట్టటం కాకుండా, మొత్తంగా నవల ఏమి చెబుతుందో పరిశీలించాలని అన్నది. సమాజానికి ఎలాంటి చెడు చేసే ఉద్దేశం ఈ కధకు లేదనీ తీర్మానించింది. కామేచ్ఛ కలిగించేటట్లుగా ఈ కధలోని విషయాలు లేవనీ, కేవలం ఆలోచనలు రేకెత్తించే అంశాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇంతకీ ఈ నవలలో ఏముంది?

ఈ నవల 1940ల్లో తిరుచెంగోడు ప్రాంతం లో గౌండర్ కులానికి చెందిన వ్యవసా య కుటుంబంలోని కాళి, అతని భార్య పొన్నల కథ. పెళ్లయి పన్నెండేళ్లయినా సంతానం కలగలేదు. దీని వల్ల సమాజం వాళ్లను కించపరుస్తూ ఉంటుంది. పెళ్లయినా సంతానం కలగకపోవడంతో అవహేళనకు గురయ్యే పరిస్థితి మన సమాజంలో నేటికీ ఉంది. ఈ నవల కథా సందర్భం వందేళ్ల నాటిది అని గుర్తుంచుకుంటే దాని తీవ్రత అర్థమవుతుంది. కాళి, పొన్నల సంతానలేమికి కారణం వంశాగల్ శాపమనీ, తిరుచెంగోడు కొండల మీద వెలసిన పవల్ అనే దుష్టదేవత విగ్రహం కూడా ఒక కారణమనీ వారి ఇరువురి తల్లులూ భావిస్తుంటారు. శాంతిపూజ చేయిస్తారు. వంశాకురం లేకపోవడం తీవ్ర అవమానంగా భావి స్తారు.
(తిరుచెంగోడ్ ఆలయం ఫోటోలు )

చివరకు ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న ఒక సంప్రదాయంలో పరిష్కా రం వెతుకుతారు. ఆ ప్రాంతంలో ఉన్న అర్ధనారీశ్వర దేవాలయం వద్ద జరిగే రథోత్సవాలలో పదునాల్గవ రోజు సంతానంలేని వివాహిత స్త్రీలు (దైవరూప) పరపురుషునితో సంగమించే ఆచారం వందేళ్ల క్రితం ఉండేది. తద్వారా సంతానం కలిగితే ఆ సంతానానికి సామి పిళ్లై (దేవుని బిడ్డ) అని నామకరణం చేస్తారు. ఆ ఆచారాన్ని అనుసరించాలా వద్దా అన్న మీమాంస కాళి, పొన్నల మధ్య, ఆ ఇద్దరి కుటుంబాల నడుమా, వారి లోలోపల తీవ్ర మానసిక సంఘర్షణ రేపుతుంది. సంతాన లేమికి కారణం కాళిలో ఉందని భావిస్తారు. దానికి రుజువులేమీ లేవు. ఆ సంఘర్షణను అత్యంత సున్ని తంగా చిత్రించాడు రచయిత.
భూస్వామ్య సమాజ భావజాల సంక్లిష్టతలను వాటికి వాస్తవికతను, పాటించి, కళాత్మ కతను జోడించి అద్భుతంగా చిత్రించాడు. సమాజం లోని భావజాల వత్తిళ్లు, వ్యక్తుల్ని కుటుంబాలను ఎలా పీడిస్తాయో మనకర్థ మవుతాయి. పొన్న అత్త, కాళి తల్లి తండ్రి, పొన్న సోదరుడు ఆ పద్నాల్గవ రోజు ఉత్సవానికి పొన్నను పంపుతారు. పొన్న సోదరుడు కాళిని ఒక కొబ్బరి తోటకు తీసుకుపోయి తాగించి మైకంలో ఉంచుతా డు. రథోత్సవంలో పొన్న సంగమంలో పాల్గొందా లేదా అన్నదాన్ని రచయిత చిత్రించలేదు. కాళీ మైకం నుండి బయటపడిన తర్వాత భార్య పొన్న తనను మోసం చేసిందని కుప్పకూలుతాడు. దీనితో నవల ముగుస్తుంది
భవత్య అధర్మో దర్మోహి ధర్మాధర్మాపు భావపి

కారణాత్ దేశకాలస్య దేశకాలః స తాదృశ
(స్థల కాల పరిస్థితుల్ని బట్టి ఏది ధర్మమో అది అధర్మం కావచ్చు, అలాగతే ఏది అధర్మమో అది ధర్మంగా చెలామణీ అయ్యే పరిస్థితులూ రావచ్చు) – శాంతి పర్వము 79.31

ఇప్పటి కళ్లద్దల్లోంచి అప్పటి కాలమాన పరిస్థితులను చూస్తూ కలంపై బడితెలతో బరితెగించి దాడిచేస్తారా? దేవాలయాలపై బొమ్మలకు కూడా సెన్సారు కట్లు కావాలంటూ నల్లరంగు పులిమేస్తారా? రాసేకలానికి చట్టానికి మించి సంకెళ్ళు వేయాలని చూస్తారా? అయ్యో నా తండ్రీ నా దేశాన్ని ఎక్కడ మేల్కొలిపావయ్యా?
కల్బుర్గీని, పన్సారేని కోల్పోయిన సాహిత్య లోకపు శోకం తీరకముందే పెరుమాళ్ మెడపై కత్తివేటా?
** “ Let the author be resurrected to what he is best at. Write.”

కామెంట్‌లు