నీటికోసం కోటి తిప్పలు : కొత్త పద్దతి ఘనవర్షం (సాలిడ్ రెయిన్)

మనిషికి ఇంత తినడానికి ఏదైనా దొరకాలంటే మొక్కల్ని పెంచడం, పంటని పండించడం తప్పనిసరి, మొక్క ఎదగాలంటే తప్పనిసరిగా కావలసినది నీరు. కానీ రాన్రాను వాతావరణంలో నీరు లభించకుండా పోతోంది. నీటిని వున్న కొద్ది నీటినీ ఎలా కావాడుకోవాలి? ఆకొంచెం చాలా రోజులు ఎలా వాడుకోవాలి అనే దానిపై అత్యంత శ్రద్ద చూపించాల్సి వస్తోంది. 
కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో వున్న నీటికొరతను తట్టుకునేందుకు గొలుసుకట్టు చెరువుల పద్దతి, చెక్ డ్యాంల పద్దతిని అమలులో పెట్టాటం ద్వారా సమాధానం వెతుక్కున్నారు. లోతైన మెట్ల బావులు, ఎడ్లతో మోట కట్టడం, నత్తగుల్ల పంపులు వంటివి ఎప్పటినుంచో వాడకంలో వున్నాయ. 


సరాసరి మొదట్లో కొంచెం నీరు మాత్రమే : మొక్క మొదట్లో పాదు చేసి చాలానన్ని నీరుపోసేంత అవకాశం లేని పరిస్థితుల్లో, పూర్వం కాలం నుంచే మొక్కల మొదళ్ళలో కుండలను పాతే వారు. దానిలో పోసిన నీరు కొంచెం కొంచెంగా మొక్కలకు అందేలా ఏర్పాటు చేసారు. 1866 ప్రాంతంలోనే ఆప్ఘనిస్తాన్ లో ఇలా నీటికుండలతో సేద్యం చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్లాస్టిక్ కనుకున్న తర్వాత ఇలా ఒక్కో కుండలో నీరు పాతుకుంటూ వెళ్ళడం కాకుండా ఒక పెద్ద పాత్రలో నీటిని నిల్వ చేసి వాటిని సన్నటి గొట్టాల ద్వారా మొక్కల మొదళ్ళలోకి పంపించే పద్దతిని అవలంభించారు దీనిని ప్రస్తుతం బిందుసేద్యం, సూక్ష్మసేద్యం లేదా కారుసేద్యం అంటున్నాం. ఈ పద్దతి 1913లో, కలరాడో స్టేట్ యూనివర్శిటీలో E.B. హౌస్ నీటి పట్టికను పెంచకుండా, చెట్ల కాండ భాగానికి నీటిని అందించడం విజయవంతమైంది. 1920ల్లో జర్మనీలో రంధ్రాలు చేసిన గొట్టాలను పరిచయం చేశారు మరియు 1934లో, O.E. నోబే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో రంధ్రాలున్న కాన్వాస్ గొట్టం ద్వారా సేద్యంతో ప్రయోగం చేశాడు. ఆధునిక బిందు సేద్యం అనేది సేద్యంలో ప్రపంచంలోనే అత్యధిక విలువైన సృజనాత్మకతగా పేరు గాంచింది, 1930ల్లో ఇంపాక్ట్ స్ప్రింక్లెర్ రూపకల్పన ఉపరితల సేద్యంకు మొట్టమొదటి ఆచరణీయ ప్రత్యామ్నాయ పద్ధతిని అందించింది. బిందు సేద్యంలో సూక్ష్మ-పిచికారి శీర్షాలు అని పిలిచే పరికరాలను కూడా ఉపయోగిస్తారు, ఇవి నీటిని బొట్లు బొట్లుగా కాకుండా తక్కువ ప్రాంతంలో నీటిని పిచికారీ చేస్తాయి. వీటిని సాధారణంగా విస్తృతమైన కాండం భాగాలను కలిగిన చెట్లు మరియు వైన్ పంటలకు ఉపయోగిస్తారు. భూగర్భ బిందు సేద్యం (SDI)లో మొక్క కాండాలు వద్ద లేదా దిగువన శాశ్వతంగా లేదా తాత్కాలికంగా భూమిలో పాతిపెట్టిన డ్రిప్పెర్‌లైన్ లేదా డ్రిప్ టేప్‌లను ఉపయోగిస్తారు. ఇది వరుసగా నాటే పంట సేద్యంలో ప్రాచుర్యం పొందింది,

బిందువుగా వచ్చే నీటిబొట్లకు రక్షణగా మల్చింగ్ : సరే అలా చుక్కలు చుక్కలుగా కొంచెం కొంచె నీరు పోయడానికైనా చాలా నన్ని నీరు దొరకాలి కదా ఒకవేళ అలా కొంచెం కొంచెం నీరు పోసినా ఎండకు అవ్వన్నీ ఆవిరైపోతూ వుండటం వల్ల మొక్కకు దొరికే నీరు తగ్గిపోతూ వుంటోంది దానికి పరిష్కారంగా మొక్క మొదట్లో వరి పొట్టు, రంపపుపొట్టు, చెరకుపిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వంటి వాటిని పరిచి నీరు ఆవిరి కాకుండా అడ్డుకునే వారు. ఈ 

మధ్య వీటి బదులుగా ప్లాస్టిక్ షీట్లను మొక్క మొదట్లో కావలసినంత మేరకు ప్లాస్టిక్ షీట్ ను కప్పివుంచుతారు. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. మొక్క చుట్టూ మల్చింగ్ షీటును పరిస్తే భూమిలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. దీని ద్వారా నీటిని 30-70 శాతం వరకూ ఆదా చేయవచ్చు. మల్చింగ్ షీటు వల్ల కలుపు మొక్కల బెడద 85 శాతం వరకూ తగ్గుతుంది. మల్చింగ్ షీటు మొక్క వేర్ల చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల్ని నియంత్రిస్తుంది. దీనివల్ల వేర్లు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతాయి. వర్షపు నీరు నేరుగా భూమి పైన పడి మట్టి కోతకు గురి కాకుండా మల్చింగ్ షీటు అడ్డుకుంటుంది. తద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే మల్చింగ్ షీటు పరచిన పొలంలో ఎరువుల్ని మొక్కలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాయి. పారదర్శకమైన మల్చింగ్ షీట్లను పరచిన చేలల్లో సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించి భూమిలో దాగి ఉండే క్రిమికీటకాలు, తెగుళ్ల వ్యాప్తికి కారణమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. షీట్లు పరవడానికి తొలుత కూలీలు అవసరమైనప్పటికీ ఆ తర్వాత కలుపుతీత, అంతరకృషి వంటి పనులకు కూలీలపై అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. మల్చింగ్ షీట్లను వాడడం వల్ల టమాటా, మిరప పంటల్లో దిగుబడి 50 శాతం వరకూ పెరిగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పుచ్చ, క ర్బూజ, కాప్సికమ్ పంటల్లో కూడా మామూలు పద్ధతిలో సాగు చేసిన దాని కంటే అధిక దిగుబడులు వచ్చాయి. మొదట్లో పెట్టుబడి వ్యయం కొంచెం ఎక్కువే అయినప్పటికీ ఆ తర్వాతి కా లంలో సాగు ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు.


క్లౌడ్ సీడింగ్ మేఘాల ముక్కుపిండి కురిపించే వర్షం : మేఘాలు చల్లబడితే వాటంతట అవి కురవటం మామూలు విషయం కానీ కనిపించే మేఘాన్ని కావాలసిన చోట వర్షంగా పడేలా చేయడం కృత్రిమ వర్షాలను క్లౌడ్ సీడింగ్ అంటారు. గాలిలోనున్న మేఘాలనుంచి వర్షాలను కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ క్లౌడ్ సీడింగ్‌ కార్యక్రమంలో అత్యాధునికమైన విమానం, భూమిపైనున్న రాడార్, ఓ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కొందరు వాతావరణ శాస్త్రజ్ఞులు, పైలెట్లు, ఇతర అధికార, అనధికారులు ఇందులో పాలుపంచుకుంటారు. భూమిపై కేవలం సంబంధిత అధికారి ఒకరుంటే చాలు. అతను భూమిపైనున్న వాతావరణ పరిస్థితులను విమానంలోనున్న అధికారులు, శాస్త్రవేత్తలకు సమాచారాన్ని చేరవేస్తుంటే సరిపోతుంది. దీంతో ఆకాశంలో విహరించే శాస్త్రజ్ఞులు మేఘాల పరిస్థితులను అంచనా వేస్తుంటారు.

కృత్రిమ వర్షాలకు ఉపయోగించే విమానం కేవలం ఈ ఒక్క పనికే ఉపయోగిస్తారు. ఈ విమానాలను అమెరికా లేదా ఇజ్రాయెల్ దేశాలనుంచి తెప్పిస్తారు. ఒక సిజన్‌లో మూడు నెలలకు విమానాన్ని తెప్పించేందుకు మరియు రాడార్‌ను ఉపయోగించేందుకు ఖర్చు దాదాపు రూ. 10కోట్లుంటుంది. అయినాకూడా ఈ ప్రయోగంతో మంచి లాభాలే ఉన్నాయంటున్నారు శాస్త్రజ్ఞులు. 

భూమిపై సిల్వర్ అయోడైడ్‌ను కాల్చి దాని కణాలను గాలిలోకి పంపడం జరుగుతుంది. దీంతో వర్షం కురుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం రెండు సంస్థలు మాత్రమే వీటి సేవలను దేశానికి అందిస్తున్నాయి. అవి సిరి ఏవియేషన్, అగ్ని ఏవియేషన్. వాతావరణంలో వస్తున్న మార్పులకారణంగా ప్రభుత్వాలు పంటలను కాపాడుకునేందుకు కృత్రిమ వర్షాలపై ఆధారపడక తప్పడంలేదు. అలా సాధ్యం అయినా గొప్పఏముంటుంది కనీసం మేఘాలంటూ వుంటేనే కదా వాటిని కురిపించే ప్రయత్నం చేసేది మరసలు పూర్తిగా మేఘాలే ఏర్పడే పరిస్థితులే లేకపోతే ఇక వర్షం కురిసే అవకాశం ఏముంటుంది. మళ్ళీ కేవలం వున్నంత నీటినే సక్రమంగా వాడుకోవలసిందే. 


ఘనవర్షం మరింత ఆధునిక పద్దతి : వర్షం అంటే ద్రవరూపంలో పడుతున్న నీళ్ళే కదా మళ్ళీ ఈ ఘన వర్షం ఏమిటి? అంటూ అనుమానం రావచ్చు, నిజమేనండీ ఇది ఘనరూపంలో వుండే వర్షమే.  అనంతపురం కంటే దారుణమైన వర్షాభావ పరిస్థితులుండే మెక్సికన్ ప్రాంతాలలో సైతం ఇప్పటికే రైతులు  ఈ పద్దతిలో పంటలు పండిస్తున్నారు. దీనిని 1970లో మెక్సికన్ వ్యవసాయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటినుండి విజయవంతంగా ఈ పద్దతిని ఉపయోగించే వ్యవసాయాన్ని చేస్తున్నారు.  సెర్జికో రికో అనే వ్యక్తి ఏకంగా సాలిడ్ రెయిన్ అనే పేరుతో సంస్థను కూడా ఏర్పాటు చేసి ఈ పద్దతికి తోడ్పాటునందిస్తూ ప్రచారం కూడా చేస్తున్నాడు. 
దీనికీ పేరు ఎందుకొచ్చింది?
ఒక రకమైన పౌడర్ మరియు స్టార్చ్ ద్రావణంతో అంటే సహజ పాలిమర్ తో సాలిడ్ రెయిన్ పదార్ధాన్ని తయారుచేస్తారు. మొదట ఈ పదార్ధాన్ని మొక్క మొదట్లో వేస్తారు. దానిపై నీళ్ళు పడ్డప్పుడు అది జెల్ రూపంలోకి మారిపోతుంది. అలా మారిన జెల్ మొక్క మొదట్లోకి చేరిన నీటిని బయటికి ఆవిరి కాకుండా సమర్ధవంతంగా కాపాడటం తోపాటు,  సంవత్సరం పొడవునా  మొక్కకు తడిఅందించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీరు అస్సలు ఇంకిపోతు ఆవిరైపోదు పైగా పంటలు పండటంలో కీలకంగా మారుతుంది. సులభంగా వినియోగించుకోదగిన ఈ పద్దతి నీరు సమృద్ధిగానే దొరుకుతున్నాయన్న ఉద్ధేశ్యంతో కావచ్చు భారతదేశంలోకి ప్రవేశించలేదు. కానీ నీటికొరత విపరీతంగా ఏర్పడిన ఇప్పటి పరిస్థితులలో మనకి కూడా ఈ పద్దతిని అడాప్ట్ చేసుకోవలసిన రోజులు వచ్చినట్లున్నాయి. ఈ దిశగా వ్యవయాసశాస్త్రవేత్తలూ, వ్యవసాయమంత్రులు, ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం వుంది. 
ఒక్కో చుక్క ఒడిసి పట్టుకోవడమే కాదు, దాన్ని సంవత్సరం పొడవునా నిలబెట్టుకోవడమూ అవసరమే.




.

కామెంట్‌లు