చిన్నికృష్ణుడి పద్యంలో పట్టుదట్టీ, సందెతాయతులు అంటే ఏమిటి?

చిన్నప్పుడు నేను నేర్చుకున్న మొదటి పద్యం ఇదేననుకుంటా, అమ్మనేర్పించిన పద్యం నాన్న వల్లెవేయించిన పద్యం పైగా మాకప్పుడు రెండో తరగతిలోననుకుంటా మొదట్లోనే ఈ పద్యం వుండేది. ఇప్పుడీ పద్యాలేవీ కనిపించడంలేదు. పండుగలూ పద్యాలూ కేవలం భక్తినే నేర్పిస్తాయా? చరిత్రను తెలుసుకునేందుకు కూడా పనికొస్తాయా? బాగా తెలిసిన వాటిల్లోకి సైతం లోతుగా చూడటం మానేసాం. కొంచెం తరచిచూస్తే, ఏదైనా ఒక ప్రశ్న అడిగే వారుంటే చాలా విషయాలు చెప్పాలని ఎదురు చూస్తున్న సాహిత్యఆధారాలుగా పద్యాలు, ఊరిపేర్లు, పాతపుస్తకాలు, తాళపత్రాలూ, పండుగ ఆచారాలూ ఎదురుచూస్తూనే వున్నాయి. 

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు

ఈ పద్యాన్ని ఈమధ్య కాలంలో చదివినప్పడు నాకు కొన్ని సందేహాలు కలిగాయి.
  • పట్టుదట్టి అంటే ఏమిటి? పట్టుబట్టటం లాంటిదా? పట్టు వస్త్రం లాంటిదా? 
  • అప్పట్లో సంది జ్వరం వస్తే పిల్లలకు కట్టె సందికాయలు, సంది తాయత్తులు లాగా చిన్ని కృష్ణుడికి కూడా వాళ్లమ్మ తాయత్తు కట్టిందని పద్యకర్త ఊహిస్తున్నాడా? లేక సందిట తాయతు అనాలా? మరేదన్నా అర్ధం వుందా? 
  • బంగరు అనాలా బంగారు అనాలా? 
  • మొలత్రాడు లేదా మొలతాడు అంటే సరిపోతుందా? 
  • చిన్ని కృష్ణాఆ.. అంటూ దీర్ఘం వుందా చిన్నికృష్ణ అంటే సరిపోతుందా?
  • సరిమువ్వలా సిరిమువ్వలా? 

సరే ఒకసారి నాకు అర్ధమయినంత వరకూ నేను పరిశీలించిన విశేషాలు మీముందుంచుతాను. మరేమైనా సవరణలుంటే పెద్దలు, విజ్ఞలు తెలియజేస్తే సంతోషంగా భావిస్తాను. 


సందర్భం : యశోద ఇంట పెరుగుతున్న చిన్ని కృష్ణుడి రూపాన్ని వర్ణిస్తూ కవి అటువంటి కృష్ణా నిన్ను చేరి కొలుస్తానయ్యా అని భక్తిగా చెపుతున్నారు. మరి ఆ కవి గారు నిజంగా గోపాల కుటుంబంలో పెరిగే కృష్ణుడిని చూసి వుంటారా? ఖచ్చింతంగా లేదు. ఆయన కూడా శృతంగా వస్తున్న బాగవత కథనం ఆధారంగా వారి ఊహను జోడించాలి. ఇక అప్పుడు కనిపించేదెవరు. తన కాలంలో తను చూసినంతలో ముచ్చటగా మురిపెంగా పెరుగుతున్న చిన్నారి బాలలకు కృష్ణుడి రూపాన్ని ఆపాదించాలి. బహుశా కవి అదే చేసి వుంటారు. 

వర్ణన లోని విశేషాలు  

చేతవెన్నముద్ద: గోపాలుర ఇంట పిల్లలకు సులభంగా అరిగుదలకు సహకరించేది, బలవర్ధకమైనదీ, ఇష్టంగా పెట్టేదీ ఏముంటుంది వెన్ననే కదా. బహుశా నెయ్యి తినడం కంటే వెన్న శ్రేష్టం ఆరోగ్యకరం అని ఇప్పటికీ చెపుతున్నారు కదా. అటువంటి వెన్నను చేతిలో పట్టుకుని వున్నాడట. వాళ్ళ అమ్మ పెట్టే వెన్న చాలకుంటే గోపికల దగ్గర వెన్నను దొంగిలించయినా తినేంత చిలిపివాడు వెన్నపై ఇష్టమున్నవాడూ కృష్ణుడని కధనమే కదా. 

చెంగల్వ పూదండ : కలువలు రాత్రిపూట వికసించే పుష్పాలయితే తామరలు (కమలాలు) పగటిపూట వికసిస్తాయి. ఆ కలువ పూవు కూడా ఎర్రనిదట. చెన్ను + కలువ = చెంగల్వ అంటే ఎఱ్ఱకలువ, హల్లకము; The red water lily. ఎర్రకలువ. చెన్ను (చెన్ ) ను ఎరుపు అనే అర్ధంలోనే కాక అందము (Grace, beauty ఉదాహరణ చెన్నుడు a beau or fop, అందగాడు) విధము (Manner) అనే సందర్భాలకోసం కూడా వాడినప్పటికీ అందమైన కలువ అనికాక ఎర్రకలువ అనేదే ఇక్కడ పొసుగుతుందని భావిస్తున్నాను. తమిళంలో సెందామరై, కన్నడలో కెంపుదావరై పదాలు కూడా ఎఱ్ఱ కలువనే సూచిస్తున్నాయి. రాత్రి పూసిన ఎర్రకలువను ఎవరో భృత్యుడు లేదా ఇష్టులు తీసుకొచ్చి చిన్నారి బాలకుడికి ఆడుకునేందుకు ఇచ్చివుంటారు. లేదా తల్లి మురిపెంగా తన బుజ్జాయికి అలంకరించి వుంటుంది. ఇప్పటికీ అమ్మలు చిన్న పిల్లలు మగపిల్లవాళ్ళయినప్పటికీ పూలతో అలంకరించడం మనం గమనిస్తూనే వుంటాం కదా. 

బంగరు మొలతాడు : కటిశృంఖల, కటిసూత్రము, ధటిని, శృంఖలము, మొలకట్టు అనేవి నడుముకు కట్టుకునే వస్త్రాన్ని జారిపోనీయకుండా పట్టుకునే విశేషణం గానే కాక, ఆటవిక జీవనంలో సైతం వివిధ ఆయుధాలను విరామ సమయంలో దోపుకునే అవసరంగా వుండేది. ఇప్పటికీ సైనికులూ పోలీసులూ తుపాకులు పెట్టుకునే హోల్ స్టర్ కానీ, అప్పట్లో కత్తిని పెట్టుకునే ఒరలు కానీ నడుముచుట్టూ వున్న బెల్ట్ (belt) వంటి దానినే ఉపయోగించాలి. waist string or thread అనేది ఒక సంప్రదాయంగా మారి మగపిల్లలకు మొలతాడు కట్టకపోతే హాని జరుగుతుందనే నిర్ణారణలకు సైతం వచ్చేసారు. అంటే ఆయుధాలను సరిగా భద్రపరచుకోలేదనీ, అంగవస్త్రం జాతిపోతుంటే వేటలోనో, పోటీలోనో,యుద్దంలోనో, కృరజంతువులనుండి తప్పించుకునేప్పుడో సక్రమంగా పనిచేయలేక నష్టపోయే అవకాశం వుంటుదన్న ధ్వనివుండవచ్చు. జాతియంగా కూడా మొలతాడు కట్టిన మొగవాడెవరన్నా వుంటే రమ్మను అనటం మనకి బాగా తెలుసు. తమిళం అణ్ణాకయిర్‌, కన్నడలో పురుషార ఉడుదార అని పిలిచే ఈ మొలతాడు వారి వారి స్థొమతలను అనుసరించి వెండి లేదా బంగారం తో చేయించుకునే వాళ్ళు. ఈ చిన్ని కృష్ణుడు తన మ్రొలకు కట్టుకున్న దారం బంగారపుదట. ఈ ఆటవెలది పద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బంగారు అనేపదం పొసగదు, బంగరు అనే పదం అలాగే త్రాడు అనికాక తాడు అనే పదం ఆటవెలది నియమాలకు సరిపోయి ఈ పద్యంతో పొసుగుతాయి. సంస్కృతీకరణలో భాగంగానే, స్వచ్ఛ ఉచ్చారణ అంటూ పొరబడుతూనే ఈ పదాలను మరికొంత సాగదీయటం చాలాచోట్ల గమనించాను.
బంగారు అంటూ గ కు దీర్ఘం ఇస్తే ఆటవెలదిలో పొసగటం లేదు










పట్టుదట్టి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903 vi.106) ప్రకారం దట్టీ లేదా దట్టి అంటే A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక అంటే అడ్డముగా చుట్టు కట్టుకొనిన పంచకట్టునే దట్టీ అంటారు. అయితే బంగారపు మొలతాడు కట్టే స్థొమత వున్నవాళ్ళు కాబట్టి శ్రేష్టమైనదిగా చెప్పుకునే పట్టుతో చేసిన దట్టీ కట్టారు అని అనుకోవచ్చు. మరొక అర్ధంలో తెల్లని, లేదా నాజూకైన సన్నని వస్త్రంతో నేసిన పంచెకట్టు కట్టుకున్నాడని కూడా అర్ధం వస్తోంది. తెలంగాణా ప్రాంతంలో పట్టుదడియాలు అంటే సన్నని వస్త్రము, తెల్లని గుడ్డ అనే అర్ధాలున్నాయి ఈ విషయాన్ని తెలంగాణా పదకోశంలో శ్రీయుతులు నలిమెల భాస్కర్ గారు ప్రస్తావించారు. చిన్నికృష్ణుడే కాదు మానవుడు ఏర్పాటు చేసుకున్న చాలా మంది దేవుళ్ళకు వారి ఊహలకు అందిన కాలంనాటి వస్త్రధారణే వుంటుంది. ఆయా దేశీయమైన వస్త్రదారణలను ఆయా దేవతలకు మనుషులు ఆపాదించారు. చూడండి బ్రహ్మ చేతిలో తాటాకులపై రాసిన పుస్తకం వుంటుంది కానీ ప్రింట్ చేసిన పుస్తకమో, ఇప్పటి ఆధునిక టాబ్లెట్ పామ్ టాప్ లో వుండవు. పురాతన కాలంలో సృష్టించుకున్న దేవుని రూపాలు, సాహిత్యకాలానికి కొంత మార్పులకు లోనయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా పరివర్తనం చెందించకుండా దానినే కొనసాగించడం చేస్తున్నాం. దీంతో గుణభక్తిస్థానంలో రూపభక్తి కూడా ప్రధానంగా చేరిపోయిందిప్పుడు. 

సందెతాయతులు : తాయితు, తాయెతు తాయెత్తు అంటే రక్షరేకు లేదా తావీజు అనే అర్ధంలోనే ఎక్కువగా తీసుకుంటున్నాం. దీని అర్ధాన్ని మరికొంచెం శ్రద్దగా పరిశీలిస్తే తాయి + ఎత్తు అని కదా తాయి అంటే తల్లి లేదా పిన్ని. An amulet, or charm containing things supposed to bring luck. తల్లి బిడ్డలకుకట్టే రక్షరేకు. సందె అనే పదాన్ని సంది జ్వరం అనే అర్ధంలోనే కాక సందిట అని తీసుకుంటే మరింత సరిపోతోంది. దండచేతికి అలంకరణ చేసుకోవడం ఈ పద్యరచన చేసిన కాలంలో ఒక అవసరం కూడా యుధ్దంలో ప్రధానంగా దాడిచేసే శరీరభాగాలను కవచాలతో కప్పివుంచుకోవాలి. తలకు శిరస్త్రాణం, ఒంటికి కవచం లాగానే, దండచేతికి కూడా ఉక్కు పట్టీలను పెట్టుకునే వారు. వాటిపై కత్తి, బల్లెం వంటివాటి ద్వారా దాడిజరిగినా రక్షణ వుండాలని. అదే పద్దతిలో దండచేతులపై బంగారపు వెండి అలంకరణలనూ, పూదండలనూ ధరించడం ఆనవాయితీ. సందికడియము అంటే An ornament worn upon the upper part of the arm. An armlet, కేయూరము. a stout bangle or double bangle worn on the upper arm, అలాగే కేయూర భూషణము కుసుళ్ళు, దండకడియము, బాహుదము, బాహుపురి, బాహుభూష, బాహుభూషణము, భుజకీర్తి, సందిక(డె)(డియ)ము, సందిదండ అనేవి వాడుకలో వున్న పేర్లు. ఉదాహరణకు సందికడియంబు అనివాడిన ఇతర పద్యాలుకూడా వున్నాయి. కావడియుట్లు చిక్కము సందికడియంబు నూకలతోఁప పొగాకుతిత్తి అనేదానిలోనూ సంది కడియం ప్రస్తావన కనిపిస్తుంది. కన్నడలోనూ దీన్ని కేయూర భూషణమనే అంటారు. తమిళంలో మేల్ కైయిల్ అణియం వళైయమ్ అంటారట. వాళ్ళమ్మ చిన్ని కృష్ణుడి దండచేతిపై చేసిన అలంకరణ గురించి కవిగారు మనతో చెపుతున్నరిక్కడ.
తాయత్తులు అంటే అస్సలు సరిపోవడం లేదు
తాయెత్తు పై మరింత లోతుగా చూస్తే 
తమిళంలో 'తాయ్' అంటే తల్లి. 'అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు అర్థం తల్లి (నుండి) ఖండించినది అని. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీనకాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడునుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది. బారసాల అయినాక ఆ గొట్టాన్ని ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడుగా కట్టేవారు. అదే తాయత్తు.
ఈ ఆచారం అనేక ప్రాంతాలలో, పల్లెపట్టుల్లో ఉండేది. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా పెద్ద జబ్బు చేసినా, సిద్ధ వైద్యులు ఈ తాయత్తులోని రక్తాన్ని తీసి ఇతర మందులు కలిపి వైద్యం చేసేవారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి స్టెమ్ సెల్స్ కావాలంటే అతని మొలత్రాడును తడిమితే సరిపోతుంది. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం ఏది?
ఐతే కాలక్రమంలో ఇలా స్టెమ్ సెల్స్ భద్రపరిచే జ్ఞానం లుప్తమైపోయింది. కేవలం ఆచారం మాత్రం మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏం ఉంచాలో తెలీక రాగిరేకులపై వ్రాసిన యంత్రాలు వంటివి ఉంచి కట్టడం ప్రారంభించారు. మెల్లగా తాయత్తు అన్నది మూఢనమ్మకం అన్న నమ్మకం ప్రబలి తాయత్తును వదిలి కేవలం మొలత్రాడు మాత్రం కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు అదీ పోయింది. పోయి ఇది వచ్చింది:
ఇప్పుడు బొడ్డు తాడునుండి స్టెమ్ సెల్స్ సేకరించి భద్రపరిచే బాంకులు భారత దేశంలో కూడా ఉన్నాయి. ఐతే ఈ ఆధునిక తాయత్తులను చాలా జాగ్రత్తగా క్రయోజెనిక్ ఉష్ణోగ్రతలలో భద్ర పరచాలి. అది ఉంటే కాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చనీ, భవిష్యత్తులో మనిషి అవయవం ఏదైనా కోల్పోతే ఈ రక్తంనుండి మళ్లీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా కృషి జరుగుతోంది.
ఐతే తాయత్తుల్లో పోసి మొలత్రాటికి కట్టి ఉంచితే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ స్టెమ్ సెల్స్ బ్రతుకుతాయా? బ్రతకవు. వాళ్లు ఏం పసర్లు కలిపి ఏ ప్రాసెస్ తో వాటిని సజీవంగా ఉంచారో,అసలు సజీవంగా ఉంచగలిగారో లేదో, వాటిని ఎలా పునర్వినియోగం చేసారో ఇప్పుడు మనకు తెలియదు. స్టెమ్ సెల్స్ ఉపయోగం గురించి ఆధునిక వైద్య విజ్ఞానం గుర్తించింది నిన్న మొన్ననే. మొలత్రాడు, తాయత్తులు ఏనాటివి? మరి శతాబ్దాలుగా అలా సేకరించిన వారు ఏ భౌతిక ప్రయోజనం లేకుండానే కేవలం మూఢనమ్మకంతో అలా చేసారా? తెలియదు. వారికి స్టెమ్ సెల్స్ గురించిన పరిజ్ఞానం ఉండేది అనడానికి ఆచారాలే తప్ప ఆధారాలు ఇప్పుడు దొరకడం లేదు కనుక దానిని గురించి వాదించడం వ్యర్థం.
భారత దేశంలో ఇలా బొడ్డుతాడునుండి రక్తాన్ని సేకరించి తాయత్తుల్లో నింపి మొలత్రాటికి కట్టి భద్రపరచడంలో ఏదో అంతు చిక్కని ప్రాచీన విజ్ఞానం ఉందని శాస్త్రవేత్తలు కూడా ఊహిస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. గూగుల్లో వెదికితే దానిమీద జరిగిన పరిశోధనల వివరాలు దొరుకుతాయి ( ఉదా: Panwar, Amishi. “Banking on Cord Blood: Decoding Amulets and Canisters in South India.” PhD thesis, Graduate Institute of International and Development Studies, Geneva, 2020.)
ఇప్పుడు మన ప్రాచీన విజ్ఞానం గురించి మాట్లాడితే "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిగా" అనే వెటకారపు మాటలే ఎదురౌతాయి. కానీ ఓపన్ మైండ్ తో పరిశోధించేవారికి మూఢాచారాలుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎన్నో విషయాల్లో అబ్బురపరచే సైన్సు సంగతులు తెలుస్తాయి.

సరిమువ్వ గజ్జెలు : ప్రాంతీయ మాండలిక పదకోశంలో మువ్వలు అనే పదాన్ని కళింగ ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ, గజ్జెలు అనే పదాన్ని తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ రాసారు. ఇక్కడ మువ్వలు, గజ్జెలు రెండూ వాడారు. నిజానికి మువ్వ అనేది గజ్జెలలో ఒక భాగం, తమిళంలో మునైయిల్‌ మూన్డ్రు ఇడై సందుగళుడైయ గజ్జై లేదా కన్నడలో మూరుతూతుగళ దొడ్డ గజ్జె అని చెప్పడంలో మొనలోమూడు సందులు గల పెద్దగజ్జె అంటూ బహుజనపల్లి సీతారామాచార్యులు [శబ్దరత్నాకరము 1912 ] గారూ పేర్కొన్నారు. సరి సంఖ్యలో వున్న మువ్వలతో కట్టిన గజ్జెలు అని అర్ధం కావచ్చు, సిరి మువ్వ అంటూ లక్షణమైన, సంపదకరమైన అంటూ సిరిని లక్ష్మి అర్ధంలో చెప్పివుంటారేమో అనుకున్నప్పటికీ అది కూడా చందస్సుకు సరిపోవడం లేదు. సరిమువ్వ అనేదే సరైన పదం అవుతోంది. మువ్వలను ఒక క్రమంలో పేర్చికట్టి తయారు చేసే గజ్జెలను పిల్లల కాళ్ళకే కాక నాట్య ప్రదర్శన సమయాల్లోనూ, జానపద కళల ప్రదర్శనల్లోనూ, పశువుల మెడల్లో అలంకరణలు గానూ వాడటాన్ని గమనిస్తాం. పిల్లలు ఆడుకుంటూ వున్నప్పుడు తల్లులు ఏదన్నా పనిచేస్తున్నప్పటికీ వారు దూరంగా వెళితే తెలియటం కోసం కూడా ఇవి ఉపయోగపడేవి. అసలే చిన్ని కృష్ణుడు ఒకదగ్గర వుండేవాడు కాదాయే అందుకే ఇవి మరింత బాగా ఉపయోగపడివుంటాయి.
సిరిమువ్వలు కూడా గణ విభజనలో కుదరటం లేదు. 
కృష్ణుడు చిన్నవాడే అయినా దీర్ఘం తీయకుండానే ఈ పద్యంలో పలుకుతాడ్లెండి
ఈ విధంగా చిన్ని కృష్ణుడి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన కవి, చివరి పాదంలో తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. అయితే కృష్ణా అంటూ దీర్ఘం తీస్తూ చాలా మంది పద్యాన్ని పాడుతున్నారు కానీ దీర్ఘం లేకుండా ఆటవెలదికి చక్కగా సరిపోతోంది.





కామెంట్‌లు