కొత్త విత్తనం కావాలి

అవే మాటలు వాడీ వాడీ
అరిగిపోయి
అర్ధాన్ని కోల్పోయాక
నేనెందుకో మూగగా మిగిలిపోతాను.

అదే నవ్వు పైపైనే
తేలిపోయి
ఆర్ధ్రతంతా ఆవిరయ్యాక
అచ్చంగా స్థబ్దమై మ్రాన్పడిపోతాను.

అదే ఆలింగనం
యాంత్రికమై
చప్పగా పుక్కిలించాక
స్థాణువై నిస్త్రాణంగా నిలబడిపోతాను.

నీ పుట్టిన రోజు నా మనసులో ఈదులాడక
సామాజిక మాద్యమాల స్పురణలో పైకితేలినపుడు
అవేవో చిత్రాలు, అచ్చంగా ctrl V మాటలు
ఎమికాన్లై హడావిడీ చేస్తే
చీకట్లో చిన్నగా నిట్టూర్చేస్తాను.

ఇదంతా నిర్లక్ష్యమనుకుంటావు నువ్వు
నిర్లిప్తతనే పదానికర్ధం వెతుకుతాను నేను
భూమితిరగటం ఆపితే కదా
బొంగరంలా తిప్పే ప్రయత్నం చేసేందుకు.
మొక్కఎదగటం ఆపితే కదా


కొరతకోణాన్ని నింపాలని చూసేందుకు.

కామెంట్‌లు