నాన్న మాట

నాన్నా...
కొడుకుగా నువ్వున్నప్పుడు
ముందుతారాలనుంచీ
నీకు ఏమి అందటం వల్ల
నాకింతగా ఇచ్చావో కానీ,

నువ్వు లేవంటున్న ఇరవై ఏళ్ళ తర్వాత
ఇంకొక్కటి అడుగుతా ఇస్తావుగా.

ఉన్న శక్తినే నా బిడ్డలకు
ఓపికతో పంచగల ప్రేమనివ్వు.

ఎన్నిసార్లు సున్నానుంచి
మొదలు కావలసివచ్చినా
ఎగిరే జెండా పొగరు లాంటి
గుండెధైర్యాన్ని అచ్చంగా
అందించటమెలాగో తెలియనివ్వు.

నాన్నా..
పనిని ప్రేమగా హత్తుకోవడం
అలల నదిని దాటుతున్నవేళ సైతం తత్తరపడకపోవటం
ప్రతి పైసా బరువునీ గుండెతో తూచగలగటం అవసరాన్ని ఒడుపుగా దానితో దాటగలగటం
నా బిడ్డలకు కూడా చెప్పాలనుకున్న ప్రతీ సారీ నువ్వు నాతో మాట్లాడుతున్నావు.

నాన్నా...
సూదిమందుకి గడ్డకట్టిన
నా దండ చేతిని
నేను ఎప్పటికో నిద్రపోయాక కొబ్బరినూనెతో రుద్దు తున్నప్పుడు ముభావంగా ఉన్న నీ ముఖం లోని భావాలని డీ కోడ్ చేసే హార్ట్ వేర్ కోసం వెతుకుతున్నప్పుడల్లా నేను ముభావంగా మారిపోతున్నానే కానీ దారం చిక్కలేదు.

నాన్నా..
అసలు ఉండటానికి లేకపోవడానికీ
తేడా ఏంటి?
ఆలోచించే దేహమే అయితే నువ్వులేకపోవచ్చు.
అనుక్షణం అండగా ఉండటం,
ప్రతి ఆలోచనలో తోడుండటం
జ్ఞాపకం తడిగా ఉండటం
అయితే
నేనున్నన్ని నాళ్ళు నువ్వుంటావు.



కామెంట్‌లు